అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ కొత్త స్ట్రాటజీ

అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ కొత్త స్ట్రాటజీ

లక్నో: ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో చిన్న పార్టీలతో మాత్రమే కలిసి బరిలోకి దిగాలని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు లోకల్  పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న అఖిలేశ్.. తాజాగా అప్నాదళ్ (కే)తో పొత్తుకూ ఓకే చెప్పారు. మంగళవారం ఆర్ఎల్డీ చీఫ్​ జయంత్ చౌధరితో భేటీ అయిన ఆయన.. బుధవారం లక్నోలో యూపీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇన్​చార్జి సంజయ్ సింగ్ తో, అప్నాదళ్ (కే) నేత క్రిష్ణ పటేల్ తోనూ సమావేశమయ్యారు. అప్నాదళ్​తో పొత్తు ఖరారు కాగా, ఆప్, ఆర్ఎల్డీ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని ఆయా పార్టీల నేతలు వెల్లడించారు. సమాజ్ వాదీ పార్టీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​తో, 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకోగా.. రెండు ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో ఈసారి చిన్న పార్టీలతో మాత్రమే కలిసి ఎన్నికలకు వెళ్లాలని అఖిలేశ్ కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఇప్పటికే సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ), జనవాదీ పార్టీ(సోషలిస్ట్), మహాన్ దళ్​తో పొత్తులకు అఖిలేశ్ యాదవ్​ ఓకే చెప్పారు.  

చర్చలు మొదలైనయ్: సంజయ్ సింగ్ 
అఖిలేశ్ తో భేటీ తర్వాత ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఎస్పీ, ఆప్ మధ్య చర్చలు మొదలయ్యాయని చెప్పారు. యూపీని అవినీతి రహితం చేయడం, శాంతిభద్రతలను కాపాడలేని ప్రభుత్వాన్ని వదిలించుకోవాలన్న కామన్ ఎజెండాపై స్ట్రాటజిక్ డిస్కషన్ జరుగుతోందన్నారు. 

ఎస్పీ వైపు తల్లి.. బీజేపీ వైపు బిడ్డ  
సమాజ్ వాదీతో పొత్తు ఫైనలైజ్ అయిందని అఖిలేశ్​తో భేటీ తర్వాత అప్నాదళ్(కే) నేత క్రిష్ణ పటేల్ వెల్లడించారు. త్వరలోనే కలిసి ప్రచారం చేస్తామని ఆమె చెప్పారు. సీట్ల పంపకం తమకు ముఖ్యం కాదని, ఇతర పార్టీలతో కలిసి వెళ్లడానికే ప్రయారిటీ ఇస్తామన్నారు. యూపీలో 403 అసెంబ్లీ సీట్లు ఉండగా, తాము 25 సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు. అయితే అప్నాదళ్(కే) పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా లేరు. కానీ క్రిష్ణపటేల్ కూతురు అనుప్రియా పటేల్ ఆధ్వర్యంలోని అప్నా దళ్(సోనేలాల్) పార్టీకి 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు. అయితే ఆమె బీజేపీ కూటమిలో ఉన్నారు. ఎంపీ కూడా అయిన ఆమె కేంద్ర సహాయ మంత్రిగా కూడా ఉన్నారు.