న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీల సభ్యత్వాలను రద్దు చేయాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్‌చేశారు. ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆదివారం రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, రాజేంద్రగుప్తా, విక్రమ్ సాహ్ని, స్వాతి మాలివాల్ ఇటీవల ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ బీజేపీలో చేరి పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లిన వీరంతా అనర్హతకు గురవుతారని తెలిపారు. ఈ అంశంపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ వంటి రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించడానికి కూడా సిద్ధమన్నారు. పార్టీని వీడిన ఏడుగురిలో ఆరుగురు పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వారేనని, ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని విమర్శించారు.

