ప్రభుత్వ ఆస్పత్రులకూ ఆరోగ్యశ్రీ నిధుల కష్టాలు

ప్రభుత్వ ఆస్పత్రులకూ ఆరోగ్యశ్రీ నిధుల కష్టాలు

ప్రభుత్వ ఆస్పత్రులకూ ఆరోగ్యశ్రీ నిధుల కష్టాలు

ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌‌ఎస్‌‌ బకాయిలు రూ.132.3 కోట్లు

నిమ్స్‌‌కు రూ.45.15 కోట్లు.. గాంధీకి రూ.18.23 కోట్లు పెండింగ్‌‌

ఆస్పత్రుల నిర్వహణ కష్టమవుతోందంటున్న సూపరింటెండెంట్లు

నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌‌ఎస్ బకాయిలు పేరుకుపోయిన ప్రతిసారీ ప్రైవేటు హాస్పిటళ్లు సమ్మె అస్ర్తాన్ని ప్రయోగించడం.. ప్రభుత్వం దిగొచ్చి ఎంతో కొంత చెల్లించి సేవలు కొనసాగించేలా చేయడం కామనైపోయింది. ప్రైవేటు హాస్పిటళ్లతోపాటు ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌‌ఎస్‌‌ పథకాల కింద రోగులకు సేవలందిస్తున్నాయి. అయితే ప్రభుత్వ దవాఖాన్లకు ఆరోగ్యశ్రీ నిధుల విడుదల చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మొత్తంగా 73 సర్కారీ దవాఖాన్లకు రూ.132.30 కోట్లు బకాయి పడింది. ఒక్క నిమ్స్ హాస్పిటల్‌‌కే రూ.45.15 కోట్ల బకాయిలున్నాయి. గాంధీ ఆస్పత్రికి రూ.18.23 కోట్లు, ఎంఎన్‌‌జే ఆస్పత్రికి రూ.17.42 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ప్రైవేటు హాస్పిటళ్ల మాదిరి సమ్మె చేయలేని తమ పరిస్థితి ఏంటని సర్కారు దవాఖాన్ల డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.

నిధుల విడుదలపై అసంతృప్తి

సర్కారీ దవాఖాన్లకు ఆరోగ్యశ్రీ కింద వచ్చే నిధుల్లో డాక్టర్లు, సిబ్బందికి 30%.. ఆస్పత్రి అభివృద్ధి, నిర్వాహణకు 70% కేటాయిస్తారు. ప్రభుత్వం సకాలంలో నిధులివ్వక డాక్టర్లు, సిబ్బంది నిరుత్సాహానికి గురవుతున్నారు. దవాఖాన్లకు ఇచ్చే అరకొర బడ్జెట్‌‌కు ఆరోగ్యశ్రీ నిధులు తోడైతే మెరుగైన సేవలు అందించొచ్చని భావించిన సూపరింటెండెంట్లకు ప్రభుత్వ తీరు తలనొప్పిగా మారింది. గాంధీ హాస్పిటల్‌‌ సూపరింటెండెంట్‌‌ డాక్టర్‌‌‌‌ శ్రావణ్‌‌కుమార్‌‌‌‌ రెండ్రోజుల క్రితం ఈ విషయంపై బహిరంగంగానే స్పందించారు. ప్రభుత్వం ఫిక్స్‌‌డ్‌‌ పేషెంట్లకే బడ్జెట్ కేటాయిస్తోందని, ఆరోగ్యశ్రీ నిధులొస్తే అదనంగా వచ్చే పేషెంట్లకు సేవలందించేందుకు కొంత ఆసరాగా ఉంటుందని చెప్పారు.

కేటాయింపులు తక్కువ.. ఖర్చు ఎక్కువ

ప్రస్తుతం ప్రభుత్వ దవాఖాన్లకు ఏడాదికి ఇంత అని ఫిక్స్‌‌డ్‌‌ బడ్జెట్‌‌ కేటాయిస్తున్నారు. ఆస్పత్రుల అభివృద్ధి నిధి కింద ఏరియా హాస్పిటళ్లకు రూ.5 లక్షలు, కమ్యూనిటీ హెల్త్‌‌ సెంటర్లకు రూ.3 లక్షలు, జిల్లా హాస్పిటళ్లకు రూ.10 లక్షల చొప్పున ఇస్తున్నారు. ఇవిగాక పథకాల అమలుకు వేరుగా బడ్జెట్ కేటాయిస్తారు. అయితే, ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే రోగుల సంఖ్యకు, కేటాయించే నిధులకు పొంతన ఉండడం లేదు. బడ్జెట్‌‌ కేటాయింపునకు బెడ్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుంటారు. అయితే గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌‌, నీలోఫర్‌‌‌‌ ఆస్పత్రులకు రోగుల తాకిడి ఎక్కువగా ఉండడంతో 30% నుంచి 50% బెడ్లు అదనంగా వేశారు. దీంతో ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సరిపోవడం లేదన్నది డాక్టర్ల ఆరోపణ. పథకాల బడ్జెట్‌‌లోనూ అధిక శాతం నేషనల్‌‌ హెల్త్‌‌ మిషన్‌‌ కింద కేంద్రం ఇచ్చిన నిధులే ఉంటున్నాయి. కాబట్టి ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌‌ఎస్‌‌ నిధులు సకాలంలో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దవాఖాన్ల నిర్వాహకులు కోరుతున్నారు.

బకాయిలు ఎక్కువగా ఉన్న దవాఖాన్ల వివరాలు(రూ.లలో)

హాస్పిటల్‌                               ఆరోగ్యశ్రీ బకాయిలు         ఈజేహెచ్‌ఎస్‌ బకాయిలు

  1. నిమ్స్‌                                 36,18,16,825           8,97,55,060
  2. గాంధీ                             18,16,03,927                    7,53,960
  3. ఎంఎన్‌జే                          17,29,22,732                   13,44,300
  4. ఉస్మానియా                       10,48,68,469                    30,250
  5. ఎంజీఎం                             5,25,86,367                     2,06,100
  6. నీలోఫర్‌‌                               4,23,20,046                   13,44,300
  7. డీహెచ్‌, కోఠి                           2,26,14,723                      3,63,000
  8. ఖమ్మం                                2,24,08,705                    11,45,000
  9. జీజీహెచ్‌, నల్గొండ                   1,76,78,014                       20,250
  10. కామారెడ్డి ఏహెచ్‌                    1,72,46,570                     60,000
  11. రిమ్స్‌                                   1,45,79,106 –
  12. కోఠి ఈఎన్‌టీ                           1,43,81,338                     1,47,020
  13. సిద్ధిపేట టీచింగ్ హాస్పిటల్‌           1,42,64,934 –
  14. నిజామాబాద్‌ డీహెచ్‌                    1,36,42,313                   10,06,180
  15. నిర్మల్‌ ఏహెచ్‌                            1,32,62,229 –