15 నెలల చిన్నారిపై ఆయా క్రూరత్వం.. పాపను కొరికి, గోడకేసి కొట్టి.. నేలపై పడేసి దారుణం

15 నెలల చిన్నారిపై ఆయా క్రూరత్వం.. పాపను కొరికి, గోడకేసి కొట్టి.. నేలపై పడేసి దారుణం

నోయిడా: చిన్నారుల ఆలనాపాలనా చూసేందుకు ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్‎లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నెలల చిన్నారిపట్ల అక్కడి ఆయా క్రూరంగా వ్యవహరించింది. పదిహేను నెలల పాపను కొరకడంతో పాటు గోడకేసి కొట్టి, నేలపై పడేసింది. ఈ దారుణ ఘటన నోయిడాలోని సెక్టార్ 137 లో ఉన్న డే కేర్ సెంటర్‎లో చోటుచేసుకుంది. 

కాంప్లెక్స్ ఆవరణలోనే డే కేర్ సెంటర్

సెక్టార్ 137 లోని పరాస్ టియెరియా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో నివాసితుల కోసం అసోసియేషన్ ఓ డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. దీనికి ప్రత్యేకంగా ఓ నిర్వాహకురాలు ఉన్నారు. టీచర్లను, ఆయాలను పెట్టి నడిపిస్తున్నారు. కాంప్లెక్స్‎లో నివాసం ఉండే దంపతులు ఉదయాన్నే ఆఫీసుకు వెళుతూ తమ చిన్నారులను ఈ సెంటర్‎లో వదిలిపెట్టి, తిరిగి సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే తీసుకెళుతుంటారు. కాంప్లెక్స్‎లోని ఓ జంట కూడా తమ 15 నెలల కూతురును ఈ సెంటర్ లో వదిలి వెళ్లేది. ఈ క్రమంలో ఇటీవల పాపను ఇంటికి తీసుకెళ్లి డ్రెస్ మార్చుతుండగా ఒంటిపై గాయాల గుర్తులు కనిపించాయి. దీంతో వెంటనే డే కేర్ సెంటర్ కు వెళ్లి ఆయాను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది.

సీసీటీవీ ఫుటేజీలో బయటపడ్డ దారుణాలు..

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పేరెంట్స్.. చిన్నారి తొడపై ఆయా కొరకడం, గోడకేసి కొట్టడం, గది మధ్యలో ఉద్దేశపూర్వకంగా పాపను కింద పడేయడం చూసి తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. వెంటనే సెక్టార్ 142 లోని పోలీస్ స్టేషన్ లో ఆయాపై ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్​ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఆయాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

కాగా, తమ కూతురును రోజూ రెండు గంటల పాటు ఆ సెంటర్ లో వదిలిపెడతామని, ఇందుకు నెలనెలా రూ.2,500 చెల్లిస్తున్నామని పాప పేరెంట్స్ తెలిపారు. పాపను జాగ్రత్తగా చూసుకుంటారనే తాము డబ్బు ఇస్తున్నామని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారే ఇలా వేధింపులకు పాల్పడ్డారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.