శాంసన్‌కు నేను వీరాభిమానిని: దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్

శాంసన్‌కు నేను వీరాభిమానిని: దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్

భారత క్రికెట్ లో మోస్ట్ అన్ లక్కీ ప్లేయర్ గా సంజు శాంసన్ కి పేరుంది. టాలెంట్ ఉన్నా అడపాదడప అవకాశాలతో సరిపెట్టేస్తున్నారని ఈ కేరళ ఆటగాడిపై చాలా మంది సింపతీ చూపిస్తుంటారు. ఆసియా కప్ లో రిజర్వ్ ప్లేయర్ గా సెలక్ట్ చేసి మళ్లీ వెనక్కి పంపించేశారు. వరల్డ్ కప్ లో అవకాశం ఇవ్వకపోగా కనీసం ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా సంజు పేరుని పరిగణలోకి తీసుకోలేదు. తిలక్ వర్మ, గైక్వాడ్ లాంటి జూనియర్స్ కి జట్టులోకి వస్తే శాంసన్ కి మాత్రం నిరాశ తప్పట్లేదు. అయితే దక్షిణాఫ్రికా సిరీస్ లో అవకాశం దక్కించుకున్న సంజు శతకం బాది శెభాష్ అనిపించుకున్నాడు.
 
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డేలో శాంసన్ కఠిన పిచ్ పై సెంచరీ చేసి తనను తాను నిరూపించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ తో శాంసన్ మీద ప్రశంసల వర్షం కురుస్తుండగా.. దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్ ఎబి డివిలియర్స్ ఈ వికెట్ కీపర్ కు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. అతని ఆటను ఆస్వాదిస్తానని తెలిపాడు. శాంసన్ ఎన్నో ఏళ్లుగా రాజస్థాన్ రాయల్స్‌ తరపున అద్భుతంగా రాణిస్తున్నాడని.. అతని ఆట ఎంతో మెరుగుపడిందని డివిలియర్స్ తెలిపాడు. 

ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ కు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. శాంసన్ టాప్ ఫోర్‌లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌లో గాయపడటంతో శాంసన్ తనను తాను నిరూపించుకోవడానికి ఇదొక చక్కని అవకాశం. అని డివిలియర్స్ తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకొచ్చాడు. ఏబీ డివిలియర్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కెరీర్ లో టాప్ లో ఉన్న ఉన్న ఈ సౌత్ ఆఫ్రికా విధ్వంసకర బ్యాటర్ 34 ఏళ్ళకే క్రికెట్ గుడ్ బై చెప్పడం ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరించింది.

2018, ఫిబ్రవరిలో సౌతాఫ్రికా తరఫున చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన ఏబీడీ.. అదే ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ప్రొటీస్‌ జట్టుకు ఆఖరుసారి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో డివిలియర్స్ 5 వేలకు పైగా పరుగులు చేయడం విశేషం. ఇక అంతర్జాతీయ క్రికెట్‌ విషయానికొస్తే.. 114 టెస్టుల్లో 8,765 రన్స్, వన్డేల్లో 228 మ్యాచ్‌లు ఆడి 9,577 పరుగులు చేశాడు. ఇక టీ20 ల్లో 78 మ్యాచుల్లో 1,672 పరుగులు చేశాడు.