ఐశ్వర్యకు అభిషేక్ బర్త్ డే విషెస్

ఐశ్వర్యకు అభిషేక్ బర్త్ డే విషెస్

ప్రపంచ సుందరి ఐశ్యర్యా రాయ్ 49వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈసందర్భంగా ఆమె భర్త, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇన్‌స్టాలో ఓ ఫొటో పోస్ట్‌ చేసి ఐశ్వర్యకు బర్త్ డే విషెస్ చెప్పారు.  ఐశ్వర్య నటించిన మూవీ నుంచి ఓ ఫోటోను అభిమానులతో అభిషేక్ పంచుకున్నారు. ఈ ఫొటోలో చీరకట్టులో కనిపించిన ఐశ్వర్య.. చేతిలో పువ్వులు పట్టుకుని తలలో పెట్టుకుంటూ కూర్చొని ఉన్నారు. అభిషేక్ బచ్చన్ తన పోస్ట్ లో ‘‘ప్రేమ, శాంతి, కాంతితో శాశ్వతమైన విజయం కలిగిన భార్యకు..’’ అంటూ రాసుకొచ్చారు. మెసేజ్ చివరిలో లవ్ సింబల్ తో కూడిన ఎమోజీని జత చేశారు. 

ఐశ్వర్యా రాయ్ 2007లో అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకున్నారు. వీరి కూతురి పేరు ఆరాధ్య. ఐశ్వర్య నటనా ప్రపంచంలోకి అడుగుపెట్టక ముందు 1994లో ప్రపంచ సుందరి కిరీటాన్ని పొందారు.  ఆమె 1997లో మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన పొలిటికల్ డ్రామా ఇరువర్‌తో.. తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరంలో రొమాంటిక్ కామెడీ "ఔర్ ప్యార్ హో గయా"తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. హమ్ దిల్ దే చుకే సనమ్, తాల్, మొహబ్బతేన్, జోధా అక్బర్, ఏ దిల్ హై ముష్కిల్ వంటి అనేక హిట్‌ చిత్రాల్లో ఐశ్వర్యా రాయ్ నటించారు. 

ఇక తెలుగు సినిమాల్లో కూడా ఐశ్వర్యరాయ్ నటించారు. 1998లో  ఆమె నటించిన జీన్స్ సినిమా పెద్ద హిట్ అవడమే కాక అకాడమీ అవార్డులను కూడా అందుకుంది. ఈ సినిమాలో హైర హైర హైరబ్బా అనే పాట అప్పట్లో ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఏఎం రత్నం నిర్మించిన ప్రియురాలు పిలిచింది సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఐశ్వర్య సింగిల్ గా కనిపించిన పలికే గోరింకా సాంగ్ హిట్ లిస్ట్ లో ఉంది.  ఈ పాటలో ఐశ్వర్య నటన ప్రేక్షకులను కట్టి పడేసింది. ఆమె కట్టు బొట్టూ అచ్చం తెలుగింటి అమ్మాయిని తలపించింది.