IND vs NZ: అభిషేక్ విధ్వంసంతో టీమిండియాకు భారీ స్కోర్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

IND vs NZ: అభిషేక్ విధ్వంసంతో టీమిండియాకు భారీ స్కోర్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ20 టీమిండియా బ్యాటింగ్ లో దుమ్ములేపింది. నాగ్ పూర్ వేదికగా బుధవారం (జనవరి 21) విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ విధ్వంసంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 84 పరుగులు చేసి నెక్స్ట్ లెవల్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులు చేసి రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, జెమీసన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. సోది, క్లార్క్, సాంట్నర్ లకు తలో వికెట్ దక్కింది. 

ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ సంజు శాంసన్ (10), ఇషాన్ కిషాన్ (8) త్వరగానే పెవిలియన్ కు చేరడంతో టీమిండియా 27 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. మరో ఎండ్ లో అభిషేక్ శర్మ ఎప్పటి లాగే దుమ్ములేపాడు. సూర్య కూడా వేగంగా ఆడడంతో స్కోర్ కార్డు పరుగులు పెట్టింది. ఇక అభిషేక్ అయితే కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆటాడుకున్నాడు.

మూడో వికెట్ కు సూర్యతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో అభిషేక్ 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్వల్ప వ్యవధిలో సూర్య (32)తో పాటు అభిషేక్ శర్మ (84) ఔట్ కావడంతో ఇండియా పరుగుల వేగం కొంచెం తగ్గింది. హార్దిక్ పాండ్య కొంచెం సేపు మెరుపులు మెరిపించాడు. మిడిల్ ఓవర్స్ లో కివీస్ పుంజుకొని వికెట్లు తీయడంతో ఇండియా 185 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే చివరి వరకు క్రీజ్ లో ఉన్న రింకూ సింగ్ భారత జట్టుకు భారీ స్కోర్ అందించాడు. చివరి ఓవర్లో రింకూ రెండు సిక్సులు, రెండు ఫోర్లు కొట్టడంతో స్కోర్ 238 పరుగులకు చేరుకుంది. రింకూ 20 బంతుల్లోనే 44 పరుగులు చేయడం విశేషం.