- రాణించిన రింకూ సింగ్
ఓపెనర్ అభిషేక్ శర్మ (35 బాల్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 84) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 48 రన్స్ తేడాతో ఇండియా కివీస్‌ను చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 238/7 స్కోరు చేసింది. చేజింగ్‌లో కివీస్ 20 ఓవర్లలో 190/7 రన్స్ చేసి ఓడింది.
నాగ్‌పూర్: యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (35 బాల్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 84) మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వేళ టీ20 వరల్డ్ కప్ చివరి సన్నాహకమైన న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా గ్రాండ్ విక్టరీతో షురూ చేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 48 రన్స్ తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 238/7 భారీ స్కోరు చేసింది.
అభితో పాటు ఫినిషర్ రింకూ సింగ్ (20 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 నాటౌట్) దంచికొట్టగా.. కెప్టెన్ సూర్యకుమార్ (32) ఫర్వాలేదనిపించాడు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, జేమీసన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌లో బ్లాక్‌క్యాప్స్ టీమ్ 20 ఓవర్లలో 190/7 స్కోరు మాత్రమే చేసి ఓడింది. గ్లెన్ ఫిలిప్స్ (40 బాల్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 78)తో పాటు మార్క్ చాప్‌మన్ (39) పోరాడాడు. వరుణ్ చక్రవర్తి, శివం దూబే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అభికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. శుక్రవారం రాయ్‌పూర్‌లో రెండో టీ20 జరుగుతుంది.
అభి అదుర్స్.. ఆఖర్లో రింకూ దంచుడు
టీ20 నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ తనదైన స్టయిల్లో దంచికొట్టడంతో ఇండియా మంచి స్కోరు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఇండియా తడబడింది. ఓపెనర్ సంజూ శాంసన్ (10)ను రెండో ఓవర్లోనే జేమీసన్ ఔట్ చేయగా.. చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (8)ను డఫీ పెవిలియన్ చేర్చాడు. అయితే కెప్టెన్ సూర్యతో కలిసి అభి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. సూర్య జాగ్రత్తగా బ్యాటింగ్ చేయగా.. అభిషేక్ మాత్రం భారీ షాట్లు కొట్టాడు. జేమీసన్ వేసిన ఐదో ఓవర్లో రెండు సిక్సర్లతో టాప్ గేర్‌లోకి వచ్చాడు.
తర్వాతి ఓవర్లో అభి, సూర్య చెరో సిక్స్ బాదడంతో పవర్ ప్లేను ఇండియా 68/2తో ముగించింది. ఎనిమిదో ఓవర్లో స్పిన్నర్ ఫిలిప్స్‌కు హ్యాట్రిక్ ఫోర్లతో వెల్‌కం చెప్పిన అభి 22 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. సగం ఓవర్లకు ఇండియా 117/2తో నిలిచింది. ఇష్ సోధీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో జోరందుకున్నట్టు కనిపించిన సూర్యను కెప్టెన్ శాంట్నర్ ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు 99 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. తర్వాతి ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదిన అభి సెంచరీ చేసేలా కనిపించినా.. ఇంకో షాట్‌కు ట్రై చేసి లాంగాన్‌లో జేమీసన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శివం దూబే (9), అక్షర్ (5) ఫెయిలైనా హార్దిక్ పాండ్యా (25) ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. చివర్లో హిట్టర్ రింకూ సింగ్ దంచికొట్టాడు. క్రిస్టియాన్ క్లార్క్ బౌలింగ్‌లో 6, 4 .. ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో జట్టుకు భారీ స్కోరు అందించాడు.
ఫిలిప్స్ పోరాటం
కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను ఇండియా బౌలర్లు సమర్థవంతంగా నిలువరించారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో కివీస్ ఏ దశలోనూ ఇండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. ఇన్నింగ్స్ రెండో బాల్‌కే డెవాన్ కాన్వే (0)ను కీపర్ క్యాచ్‌తో డకౌట్ చేసి అర్ష్‌దీప్ షాకిస్తే.. రెండో ఓవర్లో రచిన్ రవీంద్ర (1)ను హార్దిక్ పెవిలియన్‌కు పంపాడు. మరో ఎండ్‌లో ధాటిగా ఆడిన గ్లెన్ ఫిలిప్స్.. రాబిన్సన్ (21)తో మూడో వికెట్‌కు 51 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
అయితే పవర్ ప్లే తర్వాత బౌలింగ్‌కు దిగిన స్పిన్నర్ వరుణ తన మూడో బాల్‌కే రాబిన్సన్‌ను ఔట్ చేసి దెబ్బకొట్టాడు. ఓ ఎండ్‌లో ఫిలిప్స్ భారీ షాట్లతో ఎదురుదాడి చేయగా.. తనకు మార్క్ చాప్‌మన్ తోడయ్యాడు. మిడిల్ ఓవర్లలో ఇద్దరూ ఫోర్లు, సిక్సర్లతో వేగం పెంచారు. స్పిన్నర్లతో పాటు బుమ్రా, దూబే బౌలింగ్‌లో భారీ షాట్లు కొట్టారు. ఫిఫ్టీ తర్వాత ఫిలిప్స్ మరింత స్పీడందుకున్నాడు. కానీ, ఈ ఇద్దరినీ వరుస ఓవర్లలో ఔట్ చేసిన ఇండియా స్పిన్నర్లు కివీస్ జోరుకు కళ్లెం వేశారు. చివర్లో డారిల్ మిచెల్ (28), శాంటర్న్ (20 నాటౌట్) పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 238/7 (అభిషేక్ 84, రింకూ సింగ్ 44 నాటౌట్, డఫీ 2/27)
న్యూజిలాండ్: 20 ఓవర్లలో 190/7 (గ్లెన్ ఫిలిప్స్ 78, చాప్‌మన్ 39, శివం దూబే 2/28).
5000 టీ20 ఫార్మాట్‌లో వేగంగా 5 వేల రన్స్ చేసిన క్రికెటర్‌గా అభిషేక్ నిలిచాడు. తను 2898 బాల్స్‌లోనే ఈ ఘనత సాధించాడు. కెప్టెన్ సూర్య టీ20ల్లో 9 వేల రన్స్ క్లబ్‌లో చేరాడు.
