Abishek Porel: ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) యువ వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్ (Abhishek Porel) రాబోయే రంజీ ట్రోఫీ సీజన్ కోసం వెస్ట్ బెంగాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అక్టోబర్ 11వ తేదీ నుంచి కళ్యాణిలోని బెంగాల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో ఢిల్లీతో జరిగే మ్యాచ్‌తో బెంగాల్ తమ రంజీ క్యాంపెయిల్ ప్రారంభించనుంది. కానీ, గతంలో తీవ్రమైన ఆరోపణలతో అరెస్టై, ఇటీవలే బెయిల్‌పై విడుదలైన పోరెల్ మళ్లీ జట్టులోకి రావడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అభిషేక్ పోరెల్ అరెస్ట్:
కర్ణాటకకు చెందిన ఓ మెడికల్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 11న కోల్‌కతా పోలీసులు అభిషేక్ పోరెల్‌ను హుగ్లీలో అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. 2023 నుంచి వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. సుమారు ఏడాదిన్నర క్రితం వారి మధ్య విభేదాలు తలెత్తినట్లు ఆమె పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపులతో పాటు బీఎన్ఎస్ (BNS) చట్టంలోని పలు సెక్షన్లు, ఐటీ యాక్ట్ సెక్షన్లు 66E/72 కింద కేసు నమోదు అయింది. ఇక కోర్టులో పోరెల్ బెయిల్ అప్పీల్ తిరస్కరణకు గురికావడంతో అతడు జ్యుడీషియల్ కస్టడీలో ఉండాల్సి వచ్చింది. సుమారు 38 రోజులు జైలు జీవితం గడిపిన పోరెల్.. ఈ నెల ప్రారంభంలో బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఆయన బెంగాల్ జట్టులో చేరడం ఇదే తొలిసారి.
రంజీ ట్రోఫీకి బెంగాల్ జట్టు ప్రకటన:
రాబోయే రంజీ ట్రోఫీ సీజన్ కోసం అభిమన్యు ఈశ్వరన్ నేతృత్వంలో బెంగాల్ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో పలువురు సీనియర్ స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ముకేష్ కుమార్ వంటి పేసర్లు జట్టులో ఉన్నారు. అలాగే మహహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ సైతం జట్టులో చోటు దక్కించుకున్నారు. (కైఫ్ కూడా గతంలో ఇలాంటి ఆరోపణలనే ఎదుర్కొన్న సంగతి తెలిసిందే). అక్టోబర్ 11వ తేదీ నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు బ్యాటింగ్‌లోనూ తన ప్రదర్శనపై దృష్టి పెట్టనున్నాడు.
