అనవసరంగా సిజేరియన్ చేస్తే చర్యలు

అనవసరంగా సిజేరియన్ చేస్తే చర్యలు
  • 40 దవాఖాన్లలో ఎక్కువ సిజేరియన్లు 
  • ఇందులో 19 ఆస్పత్రుల్లో 70 శాతానికిపైనే కోతలు
  • లిస్ట్ తయారు చేసిన ఆరోగ్యశాఖ
  • ప్రతి రోజూ ఆడిట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 40 ప్రభుత్వ దవాఖాన్లలో అసాధారణ స్థాయిలో సిజేరియన్ డెలివరీలు జరుగుతున్నాయని ఆరోగ్యశాఖ గుర్తించింది. ఈ మేరకు పోయినేడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు హాస్పిటళ్ల వారీగా జరిగిన డెలివరీల వివరాలతో ఆఫీసర్లు ఓ రిపోర్ట్ తయారు చేశారు. రాష్ట్రంలో సగటున 61 శాతం సిజేరియన్లు జరుగుతుండగా, 20 జిల్లాల్లోని 40 హాస్పిటళ్లలో రాష్ట్ర సగటుకు మించి సిజేరియన్లు జరుగుతున్నట్టు రిపోర్ట్‌‌‌‌లో పేర్కొన్నారు. ఇందులో 19 దవాఖాన్లలో 70 శాతానికిపైగా, 21 హాస్పిటళ్లలో 65 నుంచి 70 శాతం సిజేరియన్లు జరగుతున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువగా 87 శాతం సిజేరియన్ డెలివరీలే జరుగుతుండగా..  మహబూబాబాద్ జిల్లా గూడూరు సీహెచ్‌‌‌‌సీ, నిర్మల్ జిల్లా ఖానాపూర్ సీహెచ్‌‌‌‌సీ, నిజామాబాద్‌‌‌‌ జిల్లా బాల్కొండ సీహెచ్‌‌‌‌సీలో 80 శాతానికి పైగా సిజేరియన్లు జరుగుతుండడం గమనార్హం.

అనవసరంగా సిజేరియన్ చేస్తే చర్యలు

ఇకపై ప్రతి రోజూ సిజేరియన్ డెలివరీలపై ఆడిటింగ్ నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ అన్ని హాస్పిటళ్లకు ఉత్తర్వులిచ్చారు. హాస్పిటల్ స్థాయిలో, జిల్లా స్థాయిలో సీ సెక్షన్ ఆడిటింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్, గైనకాలజిస్ట్, అనస్థెటిస్ట్, స్టాఫ్‌‌‌‌ నర్స్‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌ఎంవో ఈ కమిటీలో ఉండాలి. ప్రతి రోజూ హాస్పిటల్‌‌‌‌లో జరిగిన సిజేరియన్లపై ఈ కమిటీ ఆడిటింగ్ నిర్వహించాలి. ఎందుకు సిజేరియన్ చేయాల్సి వచ్చిందో గైనకాలజిస్ట్ వివరంగా రిపోర్ట్ రాయాలి. ప్రతి నెలా రిపోర్ట్‌‌‌‌ను కలెక్టర్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని జిల్లా సిజేరియన్ ఆడిటింగ్‌‌‌‌ కమిటీకి పంపించాలి. ఈ కమిటీలో డీఎంహెచ్‌‌‌‌వో, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్ ఆఫీసర్, గైనకాలజిస్టులు ఈ కమిటీలో ఉంటారు. నెలకోసారి ఈ కమిటీ రివ్యూ చేసి, ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించాల్సి ఉంటుంది. హెల్త్ మినిస్టర్ నేతృత్వంలోని రాష్ట్ర కమిటీ ఆడిట్ చేసి, అనవసరంగా సిజేరియన్లు చేసినట్టు తేలితే సంబంధిత హాస్పిటల్, డాక్టర్‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకుంటుంది. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.