వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే.. దేశంలో అక్రమ వలసదారుల పిల్లలకు ఇచ్చే ‘బర్త్ రైట్ సిటిజన్‌షిప్’ను రద్దు చేస్తానని రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవి బరిలో నిలిచేందుకు రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం ఆయన పోటీ పడుతున్నారు.
కాలిఫోర్నియాలోని సిమి వ్యాలీలో జరిగిన రెండో రిపబ్లికన్ డిబేట్‌లో ఆయనతోపాటు మరో ఆరుగురు పాల్గొన్నారు. డాక్యుమెంట్లు లేని వలసదారులు, అమెరికాలో జన్మించిన వారి పిల్లలను దేశం నుంచి పంపేందుకు ఏ చట్టపరమైన హామీ ఇస్తారని అడగ్గా.. జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు 2015లో అప్పటి అభ్యర్థిగా ట్రంప్ చేసిన ప్రతిపాదనను ప్రస్తావించారు.
అక్రమ వలసదారుల పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని తొలగిస్తానని చెప్పారు. గతంలో ఉద్యోగాల తొలగింపు, హెచ్1బీ వీసా, తదితర అంశాలపైనా వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.