కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న డీఈఈసెట్ అభ్యర్థులు

 కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న డీఈఈసెట్ అభ్యర్థులు
  • ప్రైవేటు కాలేజీల తనిఖీలపై తేల్చని ఎస్​సీఈఆర్టీ 
  • పట్టించుకోని విద్యా శాఖ

హైదరాబాద్, వెలుగు: డీఈఈసెట్ నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి డీఈడీ క్లాసులు ప్రారంభించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు కనీసం అడ్మిషన్ల ప్రక్రియ కూడా పూర్తికాలేదు. ప్రైవేటు కాలేజీల్లో తనిఖీలూ మొదలుపెట్టలేదు. ఫలితాలు వచ్చి 2 నెలలవుతున్నా కౌన్సెలింగ్​కూడా పూర్తికాకపోవడంతో ఈ కోర్సుల్లో చేరాలనుకునే వేలాదిమంది అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ చివరిదశలో ఉంది. డీఈఈసెట్  కౌన్సెలింగ్ ఇలాగే ఆలస్యం చేస్తూపోతే.. సీటు రాని అభ్యర్థులు డిగ్రీలో చేరే చాన్స్ కూడా కోల్పోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.

ఎస్సీఈఆర్టీ అధికారుల నిర్లక్ష్యం

డీఈడీ కోర్సు చదివేదంతా పేద పిల్లలే కావడంతో ఎస్సీఈఆర్టీ, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డీఈడీ నోటిఫికేషన్ సమయంలోనే పూర్తి కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ఎస్​సీఈఆర్టీ, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు పంపిస్తారు. అయినా తనిఖీలపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదనే దానిపై విమర్శలున్నాయి. కాలేజీల లిస్టు పంపించాలని పలు మార్లు డీఈఈసెట్ అధికారులు కోరినా, ఎస్​సీఈఆర్టీ అధికారులు స్పందించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే కౌన్సెలింగ్ పూర్తి చేయాలని డీఈడీ అభ్యర్థులు కోరుతున్నారు.

కాలేజీలను తనిఖీలే చేయట్లే..

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 డీఈడీ కాలేజీలుండగా.. వాటిలో 90 ప్రైవేటువే. ఈ కాలేజీల్లో ఎస్సీఈఆర్టీ అధికారులు తనిఖీలు చేసి.. గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన కాలేజీలనే వెబ్ ఆప్షన్లకు అనుమతిస్తారు. కానీ, ఎస్సీఈఆర్టీ అధికారులు ఇప్పటికీ ఆ కాలేజీల్లో తనిఖీల ప్రక్రియే మొదలుపెట్టలేదు. గతంలో కొవిడ్ నేపథ్యంలో రెండు సార్లు తనిఖీలు లేకుండానే అనుమతులు ఇచ్చారు. కానీ ఈసారి ప్రొఫెషనల్, టెక్నికల్ కాలేజీల్లో తనిఖీలు చేస్తుండటంతో, డీఈడీ కాలేజీల్లో తనిఖీలు చేయాలా వద్దా అనే దానిపై స్పష్టత రాలేదు. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు ఎస్సీఈఆర్టీ అధికారులకు లేఖ రాసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపక్క ప్రైవేటు కాలేజీల్లో ఫీజులపైనా  సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో మాత్రం ఆగస్టు నెలాఖరులోనే డీఈడీ క్లాసులు మొదలయ్యాయి.

లిస్టు రాగానే కౌన్సెలింగ్

కౌన్సెలింగ్ ఆలస్యమైంది నిజమే. ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. కానీ, ప్రైవేటు డీఈడీ కాలేజీల లిస్టు ఎస్సీఈఆర్టీ అధికారుల నుంచి ఇంకా అందలేదు. లిస్టు పంపించాలని అడిగితే.. త్వరలోనే పంపిస్తామంటున్నారు. అది రాగానే కౌన్సెలింగ్ ప్రారంభిస్తాం.

- శ్రీనివాసచారి, డీఈఈసెట్ కన్వీనర్

ఇంకా నిర్ణయం తీసుకోలే

ప్రైవేటు కాలేజీల్లో తనిఖీలు చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ ఫైల్ మా దగ్గరే ఉంది. తనిఖీలపై కమిటీలో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటాం. ఇంకో వారం రోజుల టైమ్​ పట్టొచ్చు.

- రాధారెడ్డి, ఎస్​సీఈఆర్టీ డైరెక్టర్

6,550 మంది అభ్యర్థులు క్వాలిఫై..

రాష్ట్రంలోని డీఈడీ కాలేజీల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్​ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈ సెట్ ఎంట్రెన్స్ ఫలితాలు ఆగస్టు మొదటివారంలోనే రిలీజ్ చేయగా.. 6,550 మంది క్వాలిఫై అయ్యారు. సెప్టెంబర్ 5,6 తేదీ నాటికి రెండు విడతల్లో 4,800 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసిన అధికారులు ఇప్పటివరకు వాళ్లకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వలేదు.