- ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్
సంగారెడ్డి, వెలుగు: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార సరళి, అమలవుతున్న ఎన్నికల వ్యూహాలు, పార్టీ బలాబలపై డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో శనివారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తోందని, అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అన్నారు. టీఅర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్నా ఆ పార్టీకి కలిసిరావడం లేదన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో అంతులేని అవినీతితో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలుజేశారని ఆరోపించారు.
బీజేపీ పోటీ చేసే ప్రాంతాల్లో గొడవలు సృష్టిస్తూ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపుర్ లో బీజేపీ వాళ్లు జ్యోతి రావు ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేశారని, అసలు శివాజీని తిరిగి మనుగడలోకి తీసుకువచ్చిందే జ్యోతి రావు పూలే అని గుర్తు చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జూలకంటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
