అన్యాయం చేసిన హరీశ్‌‌.. మా కాలనీకి రావొద్దు.. .గజ్వేల్‌‌లో ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ కాలనీకి రావొద్దంటూ నిర్వాసితుల ఆందోళన

అన్యాయం చేసిన హరీశ్‌‌.. మా కాలనీకి రావొద్దు.. .గజ్వేల్‌‌లో ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ కాలనీకి రావొద్దంటూ నిర్వాసితుల ఆందోళన
  •     బీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు 
  •     చెప్పులు విసురుకున్న ఇరువర్గాలు 
  •      వెనుదిరిగి వెళ్లిపోయిన హరీశ్‌‌ 

గజ్వేల్, వెలుగు:  సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌లో మున్సిపల్‌‌ ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌‌రావుకు మల్లన్నసాగర్‌‌ నిర్వాసితుల నుంచి నిరసన సెగ తగిలింది. శనివారం గజ్వేల్‌‌కు వచ్చిన ఆయన స్థానిక ఇందిరా పార్క్‌‌ చౌరస్తా, పాత ఎంపీడీవో ఆఫీస్‌‌ వద్ద రోడ్‌‌షోలు నిర్వహించారు. అనంతరం మల్లన్నసాగర్‌‌ నిర్వాసిత ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్‌‌ వద్ద, ముట్రాజ్‌‌పల్లిలో రోడ్‌‌షోకు వెళ్లాల్సి ఉంది. 

ఈ విషయం తెలుసుకున్న ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ కాలనీ నిర్వాసితులు ఆందోళన మొదలుపెట్టారు. హరీశ్‌‌రావుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరికి స్థానిక కాంగ్రెస్‌‌ లీడర్లు కూడా తోడయ్యారు. వారికి పోటీగా బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు కూడా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 

ఈ క్రమంలో ఒకరిపై మరొకరు చెప్పులు సైతం విసురుకున్నారు. ‘హరీశ్‌‌రావు మాకు తీవ్ర అన్యాయం చేసిండు.. ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే మమ్ములను బలవంతంగా ఊర్ల నుంచి వెళ్లగొట్టిండు.. హరీశ్‌‌రావు డౌన్‌‌డౌన్‌‌, గో బ్యాక్‌‌.. మాకు అన్యాయం చేసిన ఆయన మా కాలనీకి రావద్దు’ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. నిరసన విషయం తెలుసుకున్న హరీశ్‌‌ రావు తన ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఆర్ అండ్ ఆర్ కాలనీకి రాకుండానే వెనక్కి వెళ్లిపోయారు.