- మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు
- ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు తో కలిసి జుక్కల్లో ప్రచారం
పటాన్చెరు, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని శివాజీ చౌక్ వద్ద ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ..నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని గుర్తు చేశారు.
ఇదే ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీకి సీఎం రేవంత్ రెడ్డి రూ.15 కోట్ల నిధులను కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
