గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ విభాగం విద్యార్థులు ప్రదర్శించిన “హోలీ” నాటకాన్ని అడ్డుకొని, దాడి చేసిన ఏబీవీపీ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రజినీకాంత్ డిమాండ్ చేశారు. మే 3న జరిగిన ఈ ప్రదర్శన సమయంలో ముందస్తు ప్రణాళికతో వచ్చిన ఏబీవీపీ గుంపులు బీర్ బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడికి దిగి అల్లర్లు సృష్టించడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ హింసలో పలువురు విద్యార్థులతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కూడా తీవ్రంగా గాయపడ్డారని, ఇది క్యాంపస్ ప్రజాస్వామ్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. యూనివర్సిటీలో గుండాగిరీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి, గాయపడిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
