డిమాండ్ ఉన్నా ఈ రూట్లలో ఏసీ బస్సులు నడపట్లే

 డిమాండ్ ఉన్నా  ఈ రూట్లలో ఏసీ బస్సులు నడపట్లే

గ్రేటర్​సిటీ పరిధిలో తిరుగుతున్న ఆర్టీసీ ఏసీ బస్సులు ఎక్కేందుకు జనం ఇంట్రస్ట్​చూపించడం లేదు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నా ఏసీ బస్సుల వైపు చూడడం లేదు. పెరుగుతున్న టెంపరేచర్లతో ఏసీ బస్సులకు డిమాండ్ ఉంటుందని ఆర్టీసీ అధికారులు భావించగా, పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏసీ బస్సుల డెయిలీ ఆక్యుపెన్సీ రేషియో 50 శాతానికి మించట్లేదు. ఇటీవల మరిన్ని రూట్లలో కొత్తగా ఏసీ బస్సులు నడపాలనుకున్న అధికారులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. 

డిమాండ్​ఉన్న రూట్లలో ఆర్టీసీ ఏసీ బస్సులను నడపట్లేదనే విమర్శలు వస్తున్నాయి. మెజారిటీ బస్సులను ఐటీ కారిడార్​పరిధిలోనే నడుపుతున్నారని జనం మండిపడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే మెహిదీపట్నం – సికింద్రాబాద్​, ఎల్బీనగర్​– సికింద్రాబాద్, మియాపూర్​– కోఠి, మెహిదీపట్నం – కోఠి, ఉప్పల్– కూకట్​పల్లి రూట్లలో ఏసీ బస్సులు నడపాలని డిమాండ్ ఉన్నా ఆర్టీసీ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కంటోన్మెంట్ డిపో నుంచి మొత్తం 38 ఏసీ బస్సులు నడుస్తుండగా, అందులో 29 బస్సులు ఎయిర్​పోర్టుకు, 9 బస్సులు సికింద్రాబాద్​ నుంచి కూకట్​పల్లి(219 రూట్)  మీదుగా పఠాన్​చెరు వరకు నడుస్తున్నాయి. 

మియాపూర్–2 డిపో నుంచి మొత్తం 27 ఏసీ బస్సులు నడుస్తుండగా, అందులో 20 బస్సులు ఎయిర్​పోర్టుకు, 7 బస్సులు హెచ్​సీయూ నుంచి హైటెక్​ సిటీ(195 డబ్ల్యూ) మీదుగా బాచుపల్లి క్రాస్​రోడ్​వరకు నడుస్తున్నాయి. అయితే 219, 195 డబ్ల్యూ రూట్లలో నడిచే 15 బస్సుల ఆక్యూపెన్సీ 50 శాతానికి మించట్లేదని తెలుస్తోంది. అలాగే ఐటీ ఉద్యోగుల కోసం సైబర్ లైనర్స్​పేరుతో రాయదుర్గం మెట్రో స్టేషన్​నుంచి వేవ్​ రాక్​, జీఏఆర్, డీఎల్ఎఫ్​ వరకు నడిచే 15 మినీ ఏసీ బస్సుల్లోనూ అనుకున్నంత ఆక్యుపెన్సీ రేషియో ఉండడం లేదు. ఆర్టీసీ అధికారులు మాత్రం ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.