రాజా రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు

రాజా రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు
  •     మరో 92 మందికి అకాడమీ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
  •     80 మందికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన ప్రముఖ కూచిపూడి కళాకారులు రాజా రాధారెడ్డి దంపతులకు నాటక రంగంలో ప్రతిష్టాత్మకమైన ‘అకాడమీ రత్న’అవార్డు వరించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ బుధవారం సంగీత నాటక అకాడమీ అవార్డులను ప్రకటించింది. రాజా రాధారెడ్డితో పాటు వినాయక్ ఖేదేకర్, ఆర్.విశ్వేశ్వరన్, సునయన హజరిలాల్, దులాల్ రాయ్, డీపీ సిన్హాలకు అకాడమీ రత్న అవార్డులు దక్కాయి.

 అలాగే 2022, 2023 ఏడాదికి గాను మరో 92 మందికి అకాడమీ పురస్కారాలు, 80 మంది యువ కళాకారులకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రకటించింది. అకాడమీ రత్న అవార్డు గ్రహీతలకు రూ.3 లక్షలు, అకాడమీ పురస్కార గ్రహీతలకు రూ.లక్ష, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారా గ్రహీతలకు రూ.25 వేల నగదుతో పాటు తామ్రపత్రం, అంగవస్త్రాన్ని అందజేయనున్నట్లు సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఈ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలిపింది.

కూచిపూడి ఖ్యాతిని చాటుతున్న దంపతులు..

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన రాజా రాధారెడ్డి దంపతులు తమ ప్రదర్శనలతో కూచిపూడి కళను ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. ఢిల్లీలో నాట్య తరంగిణి అనే కాలేజీని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌‌లోనూ తమ శాఖను ప్రారంభించారు. కళా రంగంలో వీరు చేసిన విశిష్ట సేవకు కేంద్రం పద్మ భూషణ్‌‌, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. 1991లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 2010లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజా రాధారెడ్డిలను గౌరవ డాక్టరేట్‌‌లతో సత్కరించింది.

మాపై బాధ్యత పెంచింది..

సంగీత నాటక రంగంలో ప్రతిష్టాత్మకమైన అకాడమీ రత్న అవార్డు రావడం తమపై మరింత బాధ్యత పెంచిందని రాజారెడ్డి ‘వీ6 వెలుగు’తో అన్నారు. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్‌‌పై ఉన్న మక్కువే తనను ఈ స్థాయికి చేర్చిందని తెలిపారు. జీవితంలోనే కాకుండా కళలోనూ తన సతీమణీ రాధా అర్థ భాగమయ్యారన్నారు. తన సహకారంతో కూచిపూడి కళను అమెరికా, క్యూబా, రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ప్రదర్శించి, ఆయా దేశాల అగ్రనేతల ప్రశంసలు పొందామని ఆయన వెల్లడించారు.