ఫైల్ ఫార్వర్డ్ చేసేందుకు రూ.20 వేలు

ఫైల్ ఫార్వర్డ్ చేసేందుకు రూ.20 వేలు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎక్సైజ్ జూనియర్ అసిస్టెంట్

వికారాబాద్, వెలుగు:  హెడ్ ఆఫీసుకు ఫైల్ ఫార్వర్డ్ చేసేందుకు రూ.20వేలు లంచం డిమాండ్ చేసిన వికారాబాద్ ఎక్సైజ్ ఆఫీసుకి చెందిన జూనియర్ అసిస్టెంట్ మంగళవారం  ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వివరాల ప్రకారం..జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసులో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే ఖాజా హుస్సేన్ 3 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ప్రభుత్వం హుస్సేన్ భార్యకు ఆ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.  పెన్షన్ పేపర్లు, ఉద్యోగం కోసం సమర్పించాల్సిన ఫైల్ ను..హైదరాబాద్ లోని ఎక్సైజ్ హెడ్ ఆఫీసుకు పంపాల్సి ఉంటుంది. ఈ ఫైల్ ను హెడ్ ఆఫీసుకు ఫార్వర్డ్ చేసేందుకు వికారాబాద్ ఎక్సైజ్ ఆఫీసులో ఉండే జూనియర్ అసిస్టెంట్ సురేశ్​రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కొన్ని రోజుల క్రితం హుస్సేన్ భార్య..సురేశ్ కు రూ.8 వేలు ఇచ్చి..మిగతావి తర్వాత ఇస్తానంది. అయినా సురేశ్​ ఆ ఫైల్ ను హెడ్ ఆఫీసుకు పంపలేదు. హుస్సేన్ భార్య ఈ విషయాన్ని తన భర్త సోదరుడు షేక్ ఫయాజ్ హుస్సేన్ కు చెప్పింది.  ఫయాజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం ఫయాజ్ నుంచి మిగతా డబ్బు రూ.12 వేలను సురేశ్ తీసుకుంటుండగా..ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ సీఐలు గంగధర్, మాజిద్, రామలింగారెడ్డి, నాగేంద్రబాబు పాల్గొన్నారు.