సిద్దిపేట జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏసీబీ దాడిలో పంచాయతీ సెక్రటరీ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికాడు.
అసలేం జరిగిందంటే..? గ్రామ పరిధిలో డ్రైనేజీ పైపులైన్ తొలగించే విషయంలో ఒక వ్యక్తి నుంచి రూ. 10 వేల లంచం డిమాండ్ చేశాడు పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు. కార్యదర్శి రాజు ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ కేసులో కేవలం కార్యదర్శి మాత్రమే కాకుండా సర్పంచ్ భర్త గొల్లపల్లి ఆంజనేయులు పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు ఆంజనేయులును కూడా అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. లంచం తీసుకున్న డబ్బును స్వాధీనం చేసుకున్న అధికారులు, కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నారు.
