ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ఆస్తులు రూ.100 కోట్లు

ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ఆస్తులు రూ.100 కోట్లు
  •      ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా ఏడీ కొంతం శ్రీనివాసులు
  •     మూడు రాష్ట్రాల్లో సోదాలు, 22 ఎకరాల భూమి, 8 ప్లాట్లు, రైస్ మిల్లు
  •      1.6 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదు సీజ్‌‌, కేసు నమోదు

ఇబ్రహీంపట్నం/నారాయణపేట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా సర్వే, సెటిల్​మెంట్ అండ్​ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌‌‌‌ కొంతం శ్రీనివాసులుపై ఏసీబీ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది. సైబరాబాద్‌‌ రాయదుర్గం మైహోం భూజ అపార్ట్‌‌మెంట్‌‌లోని శ్రీనివాసులు ఇంటితో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌‌లోని ఆయన ఆఫీసు, కర్నాటక, అనంతపూరం, మహబూబ్‌‌నగర్‌‌, నారాయణపేట జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. మైహోం భూజలోని ఆయన నివాసంలో బినామీలు, కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. మహబూబ్‌‌నగర్​ టౌన్‌‌లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన శ్రీనివాసులు విధుల్లో భాగంగా ల్యాండ్‌‌ సర్వేలు సహా రికార్డులను తయారు చేసేందుకు పెద్దమొత్తంలో లంచాలు తీసుకుంటున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఏసీబీ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గురువారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించింది.

మైహో భూజలో ఫ్లాటు, రెండు కార్లు

మైహోం భూజలోని ఆయన నివాసంతో పాటు మహబూబ్‌‌నగర్‌‌‌‌, నారాయణపేట హిందూపూర్‌‌‌‌ గ్రామంలోని వసుధ రైస్‌‌ మిల్‌‌ సహా ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో మైహోం భూజాలో ఫ్లాట్, నారాయణపేటలో రైస్ మిల్లు, మూడు ప్లాట్లు, మహబూబ్‌‌నగర్‌‌లో నాలుగు ప్లాట్లు, కర్నాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఏపీలోని అనంతపూర్‌‌లో 11 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకుంది. శ్రీనివాసులు నివాసం రూ.5 లక్షల నగదు, సుమారు 1.6 కిలోల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకుంది. కియా సెల్టోస్, ఇన్నోవా కార్లను సీజ్ చేసింది. ఈ మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం దాదాపు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీనివాసులును అరెస్ట్‌‌ చేశారు.