పెండింగ్​ బిల్లులు ఇచ్చేందుకు లంచం డిమాండ్​

పెండింగ్​ బిల్లులు ఇచ్చేందుకు లంచం డిమాండ్​
  • ఏసీబీ వలలో ముగ్గురు మున్సిపల్​ అధికారులు

కుత్బుల్లాపూర్, వెలుగు: చేసిన పనులకు పెండింగ్​బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్​ను లంచం డిమాండ్​చేసిన ముగ్గురు అధికారులను ఏసీబీ పట్టుకుంది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వివరాల ప్రకారం.. రాజారావు అనే సివిల్ కాంట్రాక్టర్ ఏడాది క్రితం డి.పోచంపల్లి, బహుదూర్ పల్లి గ్రామాల్లో రూ.10 లక్షల విలువైన  సీసీ రోడ్డు, పాఠశాల కిచెన్ గది, సివిల్ మరమ్మతులు పనులు చేయించాడు. ఆ తర్వాత దుండిగల్ మున్సిపాలిటీ ఏర్పడింది.

ప్రస్తుతం మున్సిపాలిటీలో మేనేజర్ గా పనిచేస్తున్న గోవిందరావునే రెండు గ్రామాల పంచాయితీ కార్యదర్శి. రాజారావు చేయించిన పనులకు సంబంధించి రూ.7.50 లక్షల బిల్లులు చెల్లించారు. మిగిలిన రూ.2.50లక్షల బిల్లు ఇవ్వకుండా సంవత్సరం నుంచి రేపు, మాపు అంటూ తిప్పుతున్నాడు. చివరికి బిల్లు పాస్ చేయాలంటే తనకి పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి రూ.13వేలు, ఫైల్ ఇవ్వాలంటే రూ.11వేలు ఇవ్వాలని బిల్ కలెక్టర్ మహేందర్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు. విసుగు చెందిన రాజారావు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు బుధవారం పథకం ప్రకారం కాంట్రాక్టర్ రాజారావుకు కెమికల్ పూసిన నోట్లు ఇచ్చి మున్సిపల్ కార్యాలయంలో ఉన్న మేనేజర్ గోవిందరావుకు, జూనియర్ అసిస్టెంట్ కృష్ణారెడ్డికి ఇప్పించారు.

బిల్ కలెక్టర్ మహేందర్ రెడ్డికి డబ్బులు తెచ్చానని ఫోన్​చేసి చెప్పగా తన అసిస్టెంట్ కిరణ్​కు ఇవ్వమని చెప్పగా అతనికి ఇప్పించారు. వెంటనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మహేందర్ రెడ్డి పరారీలో ఉన్నాడు.