- హనుమకొండ ఆఫీసర్ వెంకట్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
- హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో ఏసీబీ సోదాలు
- ఆయన విల్లా, ఫ్లాట్‌తోపాటు మరో ఏడు చోట్ల తనిఖీలు
- 2008లోనూ అక్రమాస్తుల కేసులో అరెస్ట్, సస్పెన్షన్
హనుమకొండ/మిర్యాలగూడ/హైదరాబాద్, వెలుగు: హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఎర్రమాడ వెంకట్‌రెడ్డిపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఆయన రూ.100 కోట్లకుపైగానే ఆస్తులు కూడబెట్టినట్టు సోదాల్లో బయటపడింది. హైదరాబాద్ మంచిరేవులలోని ఆయన నివాసంతో పాటు వరంగల్, నల్గొండ, మిర్యాలగూడలోని బంధువుల ఇండ్లు సహా 8 ప్రాంతాల్లో ఏసీబీ బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. మంచిరేవులలోని వెంకట్‌రెడ్డి విల్లా సహా బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
వెంకట్‌రెడ్డి బ్యాంక్ అకౌంట్లలో నిల్వ ఉన్న రూ.44 లక్షల నగదు సీజ్ చేశారు. ఎల్బీ నగర్ రాక్‌టౌన్ కాలనీలో ఫ్లాట్, నల్గొండలో 8 ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ సహా వ్యవసాయ భూముల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అధికారికంగా రూ.7.69 కోట్లుగా ఏసీబీ నిర్ధారించింది. అయితే, ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.100 కోట్ల దాకా ఉంటుందని అంచనా. హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న వెంకట్‌రెడ్డికి అదే జిల్లా ఇన్చార్జి డీఈవో బాధ్యతలు అప్పగించారు.
ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్గుర్తింపు రెన్యూవల్ చేసేందుకు రూ.60 వేలు లంచం తీసుకుంటూ డిసెంబర్ 5న ఏసీబీకి పట్టుబడ్డాడు. వెంకట్‌రెడ్డి సహా డీఈవో ఆఫీస్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ గౌసుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ కన్నెబోయిన మనోజ్‌ను అధికారులు అరెస్ట్‌చేశారు. ఈ ముగ్గురిని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది.
పనిచేసిన ప్రతి చోటా ఆరోపణలు..
వెంకట్ రెడ్డి పని చేసిన ప్రతి చోటా ఆరోపణలు ఉండటంతో ఆయనపై నిఘా పెంచిన ఏసీబీ ఆఫీసర్లు కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్ లోని ఆయన విల్లా, ఫ్లాట్ తో పాటు ఆయన బంధువులు, పని చేసిన ప్రాంతాలు మరో ఏడు చోట్ల సోదాలు జరిపారు. వెంకట్ రెడ్డి పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు.
బుధవారం ఏసీబీ ఆఫీసర్లు చేపట్టిన తనిఖీల్లో ప్రభుత్వ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.4.65 కోట్ల విలువైన విల్లా, ఫ్లాట్, రూ.60 లక్షల విలువైన కమర్షియల్ షాప్, రూ.65 లక్షల విలువైన 8 ఓపెన్ ప్లాట్స్, దాదాపు రూ.50 లక్షల విలువైన14.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు.
వాటితో పాటు రూ. 30 లక్షల నగదు, రూ.44,03,032 బ్యాంక్ బ్యాలెన్స్, రూ.11 లక్షల విలువైన హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, రూ.40 లక్షల విలువైన మూడు కార్లు, 297 గ్రాముల బంగారం ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం వాటి విలువ రూ.7,69,38,332 అని అంచనా వేస్తుండగా, బహిరంగ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం భూములు, ఆస్తుల విలువ రూ.వంద కోట్లకుపైగానే ఉంటుందని అంచనా.
అక్రమాస్తుల కేసులోనే గతంలో అరెస్ట్
నల్గొండ జిల్లా గుర్రంపోడుకు చెందిన వెంకట్‌రెడ్డి1995లో గ్రూప్2కు ఎంపికయ్యాడు. నల్గొండలోనే వివిధ మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో 2008లోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. సస్పెన్షన్ తరువాత మళ్లీ ఉద్యోగంలో చేరాడు. తర్వాత 2016, 2017లో జనగామ ఆర్డీవోగా పని చేశాడు. అదేసమయంలో నేషనల్ హైవే స్కీమ్‌లో బాధిత రైతులకు ఇవ్వాల్సిన పరిహారంలో కూడా వెంకట్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డట్లు ఏసీబీ గుర్తించింది.
ఆయన 2019లో జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతి పొందాడు. ఇలా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో తహసీల్దార్‌గా చేరిన నాటి నుంచి భారీగా అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూసింది. హనుమకొండ అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ)గా, జిల్లా ఇంచార్జ్ డీఈవోగా రెవెన్యూ వ్యవహారాలు, ప్రైవేట్ విద్యాసంస్థల అనుమతులకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఈ మేరకు రెండోసారి ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి.. ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ముగ్గురు అవినీతి అధికారులపై ప్రభుత్వానికి నివేదిక అందించింది.
ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఆస్తులు ఇవే..
రూ. 30 లక్షలు నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.44.03 లక్షలు
రూ.11 లక్షల గృహోపకరణాలు, రూ.40 లక్షల విలువైన మూడు కార్లు
రూ.4.35 లక్షల విలువైన 297 గ్రాముల బంగారం
హైదరాబాద్ మంచిరేవుల, ఎల్బీనగర్ రాక్‌టౌన్ కాలనీలో రూ.4.65 కోట్ల విలువైన విల్లా, ఫ్లాట్
నల్గొండలో రూ.60 లక్షల కమర్షియల్ కాంప్లెక్స్, రూ.65 లక్షల విలువైన 8 ఓపెన్ ప్లాట్లు, 14.25 ఎకరాల వ్యవసాయ భూమి
