ప్రశ్నిస్తేనే హక్కులు సాధ్యం : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ప్రశ్నిస్తేనే హక్కులు సాధ్యం : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ముషీరాబాద్/ పంజాగుట్ట, వెలుగు: అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే బోధించినట్లుగా ప్రశ్నించడం ద్వారానే హక్కుల అమలు సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళిత బహుజన ఫ్రంట్  ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ‘భారత రాజ్యాంగం - మహిళల హక్కుల పరిరక్షణ’పై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ మహనీయుల బాటలో నడవాలని పిలుపునిచ్చారు.

అత్యాచార బాధితులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.  అలాగే నిమ్స్ హాస్పిటల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు తీరును ఆయన పరిశీలించారు. ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బ్యాక్​లాగ్ ఖాళీలు, పదోన్నతులు, నూతన నియామకాలపై చర్చించారు. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప కమిషన్ సభ్యులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తున్న విధానాన్ని వివరించగా, చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు.