మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి వివేక్ వెంకటస్వామి

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ఇఫ్తార్ విందు మత సామరస్యానికి, ఐక్యతకు నిదర్శనం: మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి
  • మందమర్రి, చెన్నూరులో రూ.కోటితో షాదీఖానాల నిర్మాణాలు
  • ప్రజలకు మెరుగైన సేవలందించేదుకే 99 యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌
  • మందమర్రిలో ముస్లింలకు రంజాన్ తోఫా అందజేత 

కోల్​బెల్ట్, వెలుగు:  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఆస్రా మసీదులో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వివేక్‌‌‌‌ మాట్లాడుతూ.. రంజాన్ వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను చాటిచెప్తాయని, ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. రంజాన్ సందర్భంగా మసీదులు, పరిసరాల్లో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గానికి 750 తోఫా కిట్లు వచ్చాయని, మందమర్రి మండలానికి 112 కేటాయించినట్లు చెప్పారు. మందమర్రి, చెన్నూరు పట్టణాల్లో రూ.కోటితో రెండు మైనారిటీ షాదీఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. చెన్నూరు షాదీఖానా కోసం మరో ఎకరం స్థలం కేటాయించాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించామన్నారు. మందమర్రిలోని 19వ వార్డులోని ఖబరిస్థాన్ ప్రహారీ కోసం రూ.15 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. 

ఏసీటీల్లో ద్వారా ఉద్యోగావకాశాలు..

రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల (ఏసీటీ) ద్వారా యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఏసీటీలు, ఐటీఐలు భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో కూడిన శిక్షణను అందిస్తున్నాయన్నారు. నిరుద్యోగులను టామ్​కామ్ ద్వారా విదేశాలకు పంపిస్తున్నామని, ఆయా దేశాల భాష, ఇతర స్కిల్స్ నేర్పిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారు స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని సూచించారు. నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే విదేశాల్లో మెరుగైన వేతనాలతో మంచి అవకాశాలున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తుందని చెప్పారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిషన్ భగీరథ స్కీం ఫెల్యూర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు అని ఆరోపించారు. 

చెన్నూరు నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నివారణకు ఇప్పటి వరకు 300 బోర్ వెల్స్ వేశామన్నారు. మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం రూ.100 కోట్లతో అమృత్ స్కీం పనులు చేపట్టామని, మరో ఆరు నెలల్లో పనులు పూర్తవుతాయని చెప్పారు. మందమర్రిలో పట్టాలున్న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే రామకృష్ణాపూర్‌‌‌‌‌‌‌‌లో ఆర్కేపీ ఓసీపీ రెండో ఫేజ్ మైన్ ప్రారంభం కానుందని, ఫారెస్ట్, పర్యావరణ క్లియరెన్స్ రాగానే బొగ్గు ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మైనార్టీ సంక్షేమ శాఖ ఆఫీసర్ నీరటి రాజేశ్వరి, డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సతీశ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ తుంగపండి రాజలింగు పాల్గొన్నారు.