హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కాయి. ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడులు వర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.
అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ బిల్స్ సెక్షన్‌లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ అరవింద్, మరో ఉద్యోగి రమేష్‌లు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ పనులను పూర్తి చేయడానికి వీరు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
తనకు రావలసిన హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పని కాకపోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు . దీంతో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు డబ్బులు తీసుకుంటున్న సమయంలో వీరిద్దరినీ పట్టుకున్నారు. ప్రస్తుతం అధికారులు కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ అవినీతి దందాతో మరికొందరికి సంబంధం ఉందా? అనే కోణంలో విచారణ సాగుతోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
