
హెచ్ఎండీఏ విజిలెన్స్ విభాగం మాజీ డీఎస్పీ జగన్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగన్ ఇంటితో పాటు.. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ హబ్సిగూడలోని ఆయన నివాసంతో పాటు.. 10 ప్రాంతాల్లో సోదాలు చేశారు. హెచ్ఎండీఏ డీఎస్పీగా ఉన్నప్పుడు భారీగా అవినీతి చేశారని జగన్ పై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హెచ్ఎండీఏకు సంబంధించిన ఓపెన్ ప్లాట్ల విషయంలో కోటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి 4 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణ వచ్చింది. దాంతో ఏసీబీ అధికారులు ఆయనకు సంబంధించిన ప్రతి ఇంట్లో తనిఖీలు చేసి.. కేజీ బంగారం, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన బంధువులు, కుటుంబసభ్యుల నివాసాల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.