టీమ్‌ వర్క్‌ తోనే గోల్డ్‌ సాధించాం: ద్రోణవల్లి హారిక

టీమ్‌ వర్క్‌ తోనే గోల్డ్‌ సాధించాం: ద్రోణవల్లి హారిక

మా కష్టానికి ప్రతిఫలం దక్కింది

నాకిది స్పెషల్‌‌ మూమెంట్

చెస్‌ ఒలింపియాడ్‌ విక్టరీపై హారిక

హైదరాబాద్, వెలుగు:  ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ లో విజేతగా నిలవడం ఇండియా చెస్ ఫ్యూచర్ కు మంచి సంకేతమని విన్నింగ్ టీమ్ మెంబర్, తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక అభిప్రాయపడింది. తమ కష్టానికి, టీమ్ వర్క్ కు  ప్రతిఫలం దక్కిందని చెప్పింది.  ‘ఈ విజయం మా ప్లేయర్లకు, ముఖ్యంగా యువ ప్రతిభావంతులకు చాలా గొప్ప విషయం. అది వారికి ఎంతో మంచి చేస్తుంది. ఈ పెర్ఫామెన్స్ తర్వాత వరల్డ్ బెస్ట్ ప్లేయర్లను ఓడించగలమన్న నమ్మకం వారిలో కచ్చితంగా పెరుగుతుంది. నా వరకు ఇది చాలా స్పెషల్ మూమెంట్.  ఎందుకంటే ఒలింపియాడ్ మెడల్ సాధించాలని నేను కలలు కన్నా. జాయింట్ విన్నర్ గా నిలిచినప్పటికీ ఇది ఎప్పటికీ మరిచిపోలేని విషయం’ అని ద్రోణవల్లి చెప్పుకొచ్చింది. ఆదివారం జరిగిన ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో రష్యాతో కలిసి ఇండియా ఉమ్మడి  విజేతగా నిలిచి తొలిసారి గోల్డ్ గెలిచింది.

ఈ గెలుపు అందరిది

టీమ్ లో ప్రతి ఒక్కరి కృషి వల్లే ఇండియా గోల్డ్ అందుకోగలిగిందని హారిక అభిప్రాయపడింది. ఈ గెలుపు సమష్టి విజయం అన్నది. ‘టోర్నీ ఆరంభం నుంచి ముగింపు వరకూ అందరూ మనసు పెట్టి ఆడారు.  ఒకరు ఓ రౌండ్లో మెరిస్తే, మరొకరు ఇంకోసారి సత్తా చాటారు. అందరం మా బెస్ట్ ఇచ్చాం. పూల్ మ్యాచ్ లో చైనాను చిత్తు చేసిన తర్వాత మా అందరిలో మెడల్ సాధించగలమన్న ఫీల్ వచ్చింది.  అప్పటి నుంచే టోర్నీలో స్పెషల్ మూమెంట్స్ పై కన్నేశాం’ అని  మహిళల  ప్రపంచ చాంపియన్ షిప్ లో మూడు బ్రాంజ్ మెడల్స్ నెగ్గిన  తెలుగు ప్లేయర్ వివరించింది.

డిఫరెంట్ ప్రిపరేషన్స్

ఒలింపియాడ్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఆన్లైన్ లో జరిగిన ఈ మెగా ఈవెంట్ కోసం తాము డిఫరెంట్ గా ప్రిపేరయ్యామని హారిక తెలిపింది. ఆన్ లైన్ ఆటకు తగ్గట్టు ప్లాన్లు వేసుకున్నామని తెలిపింది.  ‘మౌస్ ను సులభంగా కదిలించడం వంటి చిన్న చిన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసున్నాం. కానీ, కంప్యూటర్ స్క్రీన్ పై ఆడి నేనైతే చాలా అలసిపోయా. ఆన్ లైన్ లో  కాకుండా నేరుగా బోర్డుపై ఆడే కాంపిటీషన్ల కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది. ఇంటర్నేట్ ఫెయిల్యూర్ కారణంగా ఏర్పడిన టెక్నికల్ ఇష్యూస్తో ఫైనల్లో ముగ్గురు ప్లేయర్ల ఆటకు అంతరాయం కలగడం దురదృష్టకరమని అభిప్రాయపడింది. అయినప్పటికీ ఆరంభం నుంచి తాము చాంపియన్ల మాదిరిగా ఆడామని స్పష్టం చేసింది. ఈ విన్నింగ్ టీమ్లో తనతో పాటు మరో తెలుగమ్మాయి కోనేరు హంపి కూడా ఉండడం  ప్రత్యేకమైన విషయం అంది. కరోనా నేపథ్యంలో ఇప్పట్లో ఎలాంటి టోర్నీలు ఉంటాయో తనకు తెలియదని, కానీ  మళ్లీ బరిలోకి వచ్చేముందు కొంత విరామం తీసుకుంటానని హారిక చెప్పుకొచ్చింది.

మన బలమేంటో తెలిసింది: విశ్వనాథన్ ఆనంద్

చెస్ ఒలింపియాడ్ లో ఇండియా సాధించిన గోల్డ్ మెడల్ దేశంలో ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుందని లెజెండరీ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ అన్నాడు. ఈ విజయాన్ని చూసి మరెందరో చెస్ వైపు ఆకర్షితులు అవుతారన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఆటలో ఇండియా ఎంత బలంగా ఉందో ఈ విజయం ప్రపంచానికి చాటి చెప్పిందన్నాడు. టోర్నీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైమ్లో సత్తా చాటడం, క్లిష్టమైన మ్యాచ్లు గెలవడం చూసి తాను చాలా హ్యాపీగా ఫీలయ్యానని  అన్నాడు. నేషనల్ స్పోర్ట్స్ అవార్డులకు చెస్ ప్లేయర్లను చాలా ఏళ్లుగా పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఒలింపియాడ్ విక్టరీతో ఆ పరిస్థితి మారుతుందని ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ విజయం తర్వాత చెస్ ప్లేయర్లకు అర్జున, ద్రోణాచార్య అవార్డులు ఇచ్చే విషయంలో స్పోర్ట్స్ మినిస్ట్రీ పునరాలోచన చేస్తుందని ఆశిస్తున్నానని అన్నాడు. 2013 తర్వాత ఒక్క చెస్ ప్లేయర్ కూడా అర్జున అందుకోలేదు.