- మా నుంచి ముప్పు ఉందని కాదు..
- స్పీకర్కు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ
న్యూఢిల్లీ: పార్లమెంటుకు ప్రధాని నరేంద్ర మోదీ గైర్హాజరు విషయంలో అధికార బీజేపీ ఒత్తిడికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా లొంగిపోయారని కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వారు స్పీకర్కు లేఖ రాశారు. ప్రధాని సభకు రాకపోవడానికి కారణం తమ నుంచి ముప్పు ఉండడం కాదని.. కేవలం భయం వల్లనే ఆయన సభకు రాలేదని వారు లేఖలో పేర్కొన్నారు.
గత గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో చర్చ ప్రారంభించారు. అయితే, దీనిపై సమాధానం ఇచ్చేందుకు రావద్దని ప్రధాని మోదీని తాను కోరానని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఎందుకంటే, సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని తనకు కచ్చితమైన సమాచారం అందిందని సభలో చెప్పారు.
ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. స్పీకర్ ఆ ప్రకటన చేసి ఉండకూడదని అన్నారు. “స్పీకర్‌పై చాలా ఒత్తిడి ఉంది, అది సరైనది కాదు. ప్రధానిపై ఎవరైనా చేయి చేసుకోవడం లేదా ఇలాంటిదేదైనా చేయడం అనే ప్రశ్నే లేదు. అక్కడ 11 మంది మహిళా ఎంపీలు ఉన్నారు, వారందరూ సీనియర్ ఎంపీలు. స్పీకర్ఆ ప్రకటన చేయాలని ప్రభుత్వం ఆయనపై ఒత్తిడి తెచ్చింది.
అందుకే ఆయన ఆ ప్రకటన చేశారు. ఎందుకంటే ఆ రోజు సభకు రావడానికి మోదీకి ధైర్యం లేదు. కాబట్టి స్పీకర్ ఆయన తరపున వివరణ ఇస్తున్నారు. ఇది తప్పు” అని ఆమె అన్నారు. సభకు నిష్పక్షపాత సంరక్షకుడిగా వ్యవహరించాలని మహిళా ఎంపీలు స్పీకర్ఓం బిర్లాను కోరారు.
