కేసీఆర్‍, కేటీఆర్‍ బొమ్మలు తొలగించాల్సిందే

కేసీఆర్‍, కేటీఆర్‍ బొమ్మలు తొలగించాల్సిందే

జయశంకర్​ సార్​ స్మృతి వనంలో వాళ్ల బొమ్మలేంది?
ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతల మండిపాటు

వరంగల్రూరల్‍, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ సార్‍ స్మృతి వనంలో కేసీఆర్‍, కేటీఆర్‍ బొమ్మలను వెంటనే తొలగించాలని తెలంగాణ ఉద్యమ కారులు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్​చేశారు. హన్మకొండలోని జయశంకర్‍ స్మృతివనానికి సోమవారం ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, సీనియర్ జర్నలిస్ట్​ పాశం యాదగిరి, సుప్రీంకోర్టు అడ్వకేట్‍ నిరూప్‍రెడ్డి తదితరులు వెళ్లారు. అక్కడ గోడపై జయశంకర్​ సార్​ చిత్రాల పక్కన ఉన్న కేసీఆర్​, కేటీఆర్​ బొమ్మలను పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమంలోలేని కేటీఆర్​ను సార్‍ పక్కన చేర్చడం దిగజారుడుతనమన్నారు. అమరుల పక్కన బతికున్నోళ్ల బొమ్మలు పెట్టడం సరికాదని, ఒకవేళ పెట్టాల్సివస్తే  జయశంకర్​ సార్‍కు ఉద్యమ పాఠాలు నేర్పిన గురువులు ఫర్మాజీ, శ్రీధరస్వామి.. తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, మీరాకుమార్​ బొమ్మలను పెట్టాలని డిమాండ్ చేశారు. జయశంకర్‍తో కలిసి పనిచేసిన కేశవరావు జాదవ్, కాళోజీ, బియ్యాల జనార్దన్, బెల్లి లలిత, మారోజు వీరన్న, భూపతి కృష్ణమూర్తి, బత్తిని మొగిలయ్య బొమ్మలు పెట్టాలని.. లేదంటే జయశంకర్ పోరాటాల గుర్తులు పెట్టాలని సూచించారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా, కళలకు పుట్టినిల్లయిన వరంగల్​లోని సార్‍ స్మృతి వనంలో రాజకీయ ఆధిపత్యం కనపడటం బాధాకరమన్నారు. జయశంకర్‍  సార్​తోపాటు జర్నలిస్టులు, కుల, ప్రజా సంఘాలు, సబ్బండ వర్గాల ఉద్యమ ఫలితంగా వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్‍ ఫ్యామిలీ ఫొటోలు పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులుగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. స్మృతి వనాన్ని పరిశీలించినవారిలో తెలంగాణ ఉద్యమకారులు, అడ్వకేట్ ధోనేటి కృష్ణలత, మాసు సావిత్రి,  రైల్వే కార్మిక సంఘ లీడర్‍ కర్ర యాదవరెడ్డి, బీఎల్‍ఎఫ్‍ నేత సాయిని నరేందర్, ప్రజా సంఘాల నేతలు సోమ రామమూర్తి, నలిగంటి చంద్రమౌళి, నల్లెల రాజయ్య, కొండ రాధాకృష్ణ, ఈసంపెళ్లి వేణు, జన్ను ప్రమీల, కుమార్  ఉన్నారు.