
పంజాగుట్ట, వెలుగు : ఓ యువతి ఆత్మహత్య కేసులో సినీ నటుడు, పుష్ప ఫేమ్ జగదీశ్( మచ్చ)ను హైదరాబాద్పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కాకినాడకు చెందిన శ్రేష్ట(31) షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీసులు తీస్తూ.. సంగీత నగర్ లోని రేఖ డీలక్స్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో వరంగల్ కు చెందిన జగదీశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆమెకు వివాహమై భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఒంటరిగా ఉంటున్న శ్రేష్ట, జగదీశ్మధ్య సాన్నిహిత్యం ఏర్పడి రిలేషన్ షిప్ లో ఉన్నారు.
శ్రేష్టతో సంబంధం కొనసాగిస్తూనే ఆమెకు చెప్పకుండా జగదీశ్ఇటీవల మరో అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. అది తెలిసిన శ్రేష్ట.. జగదీశ్‌ను దూరం పెట్టింది. నెల్లూరుకు చెందిన దినేష్ కు దగ్గర అయింది. అయితే, వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో జగదీశ్వచ్చి వారి ఫొటోలు తీశాడు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం వారిద్దరి ఫొటోలు తీసినట్టు జగదీశ్ బెదిరించాడు.
ఓ ఫొటోను శ్రేష్ట మొబైల్ కి పంపించాడు. దీంతో ఆందోళనకు గురైన శ్రేష్ట.. నవంబర్ 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె మృతికి జగదీశ్ కారణం అంటూ ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంక్వైరీ చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.