
కమల్ హాసన్, శంకర్ కాంబోలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. జులై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ఇరవై ఎనిమిదేళ్ల క్రితం ‘భారతీయుడు’ చిత్రం అంతటి విజయం సాధిస్తుందని అనుకోలేదు. శంకర్ గారి విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది.
ఆయన ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ మూవీగా చేశారు. ఇప్పటికీ లంచాలు ఉన్నాయి కాబట్టి ‘ఇండియన్ 2’ వస్తుంది. ఇది ప్రజల సినిమా. ఇప్పటి తరానికి రిలవెంట్‌గా ఉంటుంది. ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత ఒకే దర్శకుడితో అలాంటి పాత్రతో రావడం నా అదృష్టం. ఇలాంటి అవకాశం ఏ నటుడికి రాదు. యాభై రెండేళ్ల నా సినీ జర్నీలో మూడు జనరేషన్స్ నాకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ చిత్రాన్ని కూడా హిట్ చేస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ‘భారతీయుడు ఫస్ట్ పార్ట్ చిత్రీకరించిన తర్వాత.. వేరే చిత్రాలతో బిజీగా ఉంటూనే న్యూస్ ఫాలో అవుతూ ఉండేవాడిని. వాటిలో లంచాలు తీసుకునే వారి న్యూస్ చూడగానే సేనాపతి మళ్లీ రావాలి అనుకునే వాడిని.
పర్ఫెక్ట్ స్టోరీ కోసం టైమ్ తీసుకుని భారతీయుడు 2 స్టార్ట్ చేశాం. కమల్ హాసన్ గారి లుక్ టెస్ట్‌లోనే ఆయన్ను చూడగానే గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులకు కూడా గూస్ బంప్స్ వస్తాయి. వరల్డ్‌లోనే ఆయనలా ఎవరూ కష్టపడరు. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ బెస్ట్ ఇచ్చారు’ అని చెప్పారు. నటులు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సముద్రఖని ఈ చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉందన్నారు. లిరిసిస్టులు సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, జాహ్నవి నారంగ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘గేమ్ చేంజర్’ గురించి..
‘భారతీయుడు 2’తో పాటు రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని రూపొందిస్తున్న శంకర్.. ఆ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ‘నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకుల కోసం స్ట్రయిట్ మూవీ చేస్తానని చెప్పాను. చెప్పినట్టుగానే ‘గేమ్ చేంజర్’ తెరకెక్కిస్తున్నా. రీసెంట్‌గా రామ్ చరణ్ పోర్షన్ పూర్తయింది. ఇంకా పదిహేను రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది. త్వరలోనే అది కూడా పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ అవుతాం. రామ్ చరణ్ ఎక్స్‌లెంట్ స్ర్కీన్ పర్సెన్. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీ’ అని అన్నారు.