
ఉప్పల్ (హైదరాబాద్), వెలుగు: ఆస్పత్రిలోని తన మిత్రుడికి మెడిసిన్స్ఇచ్చేందుకు వెళ్తుండగా సినీ హీరో నిఖిల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్‌కు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కారులో వెళ్తుండగా ఆపారు. ఈ–పాస్ ఉంటేనే పంపుతామని పోలీసులు చెప్పడంతో చేసేదేమీ లేక ఆయన వెనుదిరిగారు. దీనిపై ట్వీట్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓ పేషెంట్ కు అత్యవసర మందులు ఇచ్చేందుకు కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్తుండగా ఉప్పల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పేషెంట్ వివరాలు, ప్రిస్ర్కిప్షన్ చూపించినా విడిచిపెట్టలేదు. ఈ-–పాస్ తీసుకోవాల్సిందేనన్నారు. అప్పటికీ నేను 9 సార్లు ప్రయత్నించినప్పటికీ సర్వర్లు డౌన్ కావడంతో ఈ–పాస్ దొరకలేదు. అయినా ఈ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీకి అనుమతి ఉంది కదా?..’ అని ట్వీట్లో పేర్కొన్నారు. అరగంట తర్వాత దీనిపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు ‘సార్.. మీరు లొకేషన్ షేర్ చేయండి.. మా పోలీసులు వచ్చి ఆ మందులను కిమ్స్‌లోని పేషెంట్‌కు అందజేస్తారు..’ అని ట్విట్టర్లో సమాధానమిచ్చారు. అయితే అత్యవసర పనుల మీద వెళ్తున్న వారిని ఆధారాలు చూపినా పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదని ప్రజలు మండిపడుతున్నారు.