తన అభినయంతో అందానికి అర్థం మార్చింది. ‘నువ్వు నల్లగున్నవ్ పో’ అన్నచోటే తన యాక్టింగ్ స్పార్క్ చూపించింది. రిజెక్షన్స్కి తన యాక్టింగ్ రిజల్ట్స్ రుచి చూపించి, చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న షోలు, సినిమాలే చేస్తానంటున్న యంగ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఉల్కా గుప్తా జర్నీ ఇది.
ఒక వైపు స్టార్‌ప్లస్‌లో నేను లీడ్ రోల్లో చేస్తున్న కొత్త సీరియల్ ‘బన్నీ చౌ హోమ్ డెలివరీ’ టీఆర్పీ చార్ట్స్‌లో టాప్‌లో ఉండగానే, మరోవైపు రీసెంట్గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ సిరీస్ సక్సెస్ నా సంతోషాన్ని డబుల్ చేసింది. ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ చేయడానికి ఒకే ఒక కారణం డైరెక్టర్ నగేశ్ కుకునూర్. ఆయన చెప్పిన కథ అంత బాగా నచ్చింది. దీనికంటే ముందు తెలుగులో కొన్ని సినిమాలు చేశా. టెలివిజన్‌లో యాక్ట్ చేశా. ఓటీటీలో ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేయాలని, మంచి కథ కోసం చూస్తున్న టైంలో ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది.
ఇందులో నా స్టోరీ చాలా బాగుంటుంది. ఒక తండ్రికి, కూతురుకి మధ్య ఉండే అద్భుతమైన అనుబంధాన్ని చూపించారు. ప్రేమ కాన్సెప్ట్ ఎప్పుడూ రొమాంటిక్ గానే ఉండక్కర్లేదు. మీరు మీ నాన్నను ప్రేమించొచ్చు. అమ్మను ప్రేమించొచ్చు. మీ టీచర్ని, ఫ్రెండ్‌ని, పనిమనిషిని కూడా ప్రేమించొచ్చు. ఇవన్నీ ప్రేమకు ప్రతిరూపాలే. ఇంతమంచి కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎవరికైనా చేయాలనిపిస్తుంది. ఈ సిరీస్ చేశాక అమెజాన్ ఓటీటీ ప్రపంచంలో నేనూ ఒక భాగమయ్యా.
ఆరేళ్ల తర్వాత సీరియల్
బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలో యాక్ట్ చేశాక దాదాపు ఆరేండ్ల తర్వాత ‘బన్నీ చౌ హోమ్ డెలివరీ’ సీరియల్ చేస్తున్నా. ఇందులో డెలివరీ గర్ల్ బన్నీ చాలా బలమైన పాత్ర. చుట్టుపక్కల వాళ్లకు ఫుడ్ డెలివరీ చేసే ఆ అమ్మాయి జీవితంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి? అనే కోణంలో ఈ కథ నడుస్తుంది. ఇది చాలెంజింగ్ రోల్. టీవీలో నాకు ఇది కమ్‌బ్యాక్! ఒకవైపు ఈ సీరియల్ చేస్తూనే మరోవైపు ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ ప్రమోషన్స్ చేయాలి. ఒకేసారి రెండు చేయడం కష్టమైంది. ప్రతి నెలా హైదరాబాద్‌కి వచ్చి ప్రమోషన్స్ చూసుకొని వెళ్లేదాన్ని. సీరియల్ షూటింగ్ వల్ల రోజూ బిజీగా ఉంటున్నా. రోజంతా షూటింగ్ చేసి రాత్రి పడుకునేందుకు మాత్రమే ఇంటికెళ్తున్నా. అయినా సరే నేను నా పని మేనేజ్ చేసుకుంటా. మనం చేసే పనిని ప్రేమించినప్పుడు వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా దారుల్ని కనుక్కుంటాం.
చైల్డ్ యాక్టర్‌గా...
బిహార్‌లోని సహర్సాలో1997లో పుట్టా. పెరిగింది మాత్రం ముంబైలో. నాన్న గగన్, చెల్లి గోయల్ కూడా యాక్టర్సే. నాన్న యాక్టర్ కావడం వల్ల ముంబై షిప్ట్ అయ్యాం. ముంబైలో ఉన్న రస్తూంజీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివా. చైల్డ్ యాక్టర్‌గా మొదటిసారి ‘రేషమ్ దాంఖ్’లో కనిపించా. ఆ తర్వాత ‘సాత్ ఫేరే’లో సలోని కూతురు సవ్రీ పాత్ర చేశా. ఆ తర్వాత 2009లో ‘ఝాన్సీ కీ రాణి’ సీరియల్లో చిన్నప్పటి ఝాన్సీ ‘మను’ పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఈ సీరియల్ కోసం గుర్రపు స్వారీ , కత్తి ఫైటింగ్ నేర్చుకోవడానికి రెండు నెలలు ట్రైనింగ్ తీసుకున్నా. శ్లోకాలు పాడటానికి సంస్కృతం కూడా నేర్చుకున్నా.
సినిమాల్లో చేస్తా అనుకోలేదు
‘ఝాన్సీ కీ రాణీ’ చేస్తున్న టైంలో కూడా నేను సినిమాల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అప్పటికి నాకు టీవీ అంటేనే చాలా పెద్ద ప్రపంచం. చిన్నప్పుడు నాన్న చేసే సీరియల్స్ అన్నీ చూసేదాన్ని. కొంచెం పెద్దయ్యాక ‘టీవీ అంటే అందంగా ఉండాలి. అది మనతో కాదులే’ అనుకున్నా. తర్వాత ‘మను’గా చేసే ఛాన్స్ రావడం, అందులో నా యాక్టింగ్‌ను డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మెచ్చుకోవడం మొదలుపెట్టాక నా మీద నాకు కొంచెం నమ్మకం కుదిరింది. యాక్టర్‌గా నువ్వు చాలా మెచ్యూర్డ్ అనేవారు. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పేవరకు సెట్స్‌లో అటు ఇటు పరుగెత్తుతూ ఆడుకునేదాన్ని. యాక్షన్ అని చెప్పగానే నా క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని. నాన్న యాక్టర్ కావడం వల్ల, అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన నాకు యాక్టింగ్ స్కిల్స్ నేర్పేవారు. ఆయన పదిహేనేండ్లు థియేటర్ ఆర్టిస్ట్‌గా చేయడం నాకు చాలా హెల్ప్ అయింది.
నల్లగ ఉన్నానని...
మొదట్లో నా రంగు వల్ల రిజెక్షన్స్ ఎదుర్కొన్నా. ఆడిషన్లో చూడగానే వాళ్లు డైరెక్ట్‌గా ‘నో’ చెప్పేవాళ్లు. ఇంటికి వచ్చి బాధపడేదాన్ని. అప్పుడు నాన్న నాకు ధైర్యం చెప్పేవాడు. ‘ప్రపంచం ఎప్పుడూ మొద్దు నిద్రలో ఉంటుంది. వాళ్లకు అవసరమైనప్పుడు నిన్ను కచ్చితంగా తీసుకుంటారు. దానికి చాలా ఓపిక పట్టాలి. నువ్వు స్టార్ అయ్యాక నీ మొహం మీద అలా ‘నో’ చెప్పరు’ అని చెప్పేవాడు నాన్న. నల్లగా ఉండే అబ్బాయికి జోడీగా తెల్లగా ఉండే అమ్మాయి కావాలని చూస్తారు. ఆడిషన్స్‌లో ఆ విషయం మనకు డైరెక్ట్‌గా చెప్పరు. తర్వాత వేరేవాళ్ల ద్వారా ‘మీరు నల్లగా ఉన్నారు’ అని చెప్పి పంపిస్తారు. అలా చెప్పడం నాకు చాలా బాధగా అనిపించేది. ఏదేమైతేనేం ముందుగా సినిమాల్లో చేసే అవకాశం వచ్చి ఉంటే, సీరియల్స్ చేయకపోయేదాన్ని. విదేశాల్లో ఎలాగైతే రంగు చూసి టాలెంట్‌ని అంచనా వేసే తీరు మారిందో... అలానే ఇండియాలో కూడా మారుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు యాక్టర్స్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతున్నారా? లేదా? అనే చూస్తున్నారు. కానీ, రంగు చూడటం లేదు. దీపిక పడుకోన్, బిపాసా బసు ఈ విషయానికి మంచి ఎగ్జాంపుల్స్‌గా నిలుస్తారు. తెల్లగా ఉంటే ఉన్నత కుటుంబం నుంచి వచ్చారని, నల్లగా ఉంటే కిందిస్థాయి లేదా గ్రామం నుంచి వచ్చారనే భ్రమలు తొలగిపోతున్నాయి.
వాళ్లే నాకు ఇన్స్పిరేషన్
రకరకాల ఈవెంట్స్‌లో యాక్టర్స్ అవార్డ్స్ తీసుకుంటుంటే టీవీలో చూస్తుండేదాన్ని. నేను కూడా అలాగే అవార్డు తీసుకోవాలని కలలు కనేదాన్ని చిన్నప్పుడు. కానీ, ఆడిషన్స్‌లో రిజెక్షన్స్ వల్ల ఇన్ఫీరియర్గా ఫీలయ్యా. నేను ఇలాంటివన్నీ చాలా పట్టించుకుంటా. స్కూల్లో చదువుకునే రోజుల్లో ‘నువ్వు లావు అవుతున్నావ’ని అందరూ అంటుంటే, వెంటనే డైటింగ్ చేయడం మొదలుపెట్టా. అలా చేయాల్సింది కాదని నాకు తెలుసు. కానీ, చేసేశా. అదే నా కెరీర్లో కూడా జరిగింది. ఇక్కడ కూడా చాలా కాన్షియస్ అయిపోయా. అద్దంలో చూసుకుంటే, నేను అందంగా లేనని ఎప్పుడూ అనిపించదు. విద్యాబాలన్‌ను ఎక్కడో ఒక చోట నువ్వు చాలా పెద్దగా ఉన్నావని అనే ఉంటారు. దీపిక పదుకోనెను కూడా ఎక్కడో ఒక చోట నువ్వు చాలా ఎత్తుగా ఉన్నావనే ఉంటారు. రాణీముఖర్జీని కూడా తన హైట్ చూసి ఎక్కడో రిజెక్ట్ చేసే ఉంటారు. కాబట్టి, లుక్ కాదు, టాలెంట్ మాత్రమే దారి చూపిస్తుందని రియలైజ్ అయ్యాక నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ ముగ్గురే నాకు యాక్టింగ్‌లో ఇన్స్పిరేషన్. నా చర్మం రంగు వల్లే ‘సాత్ ఫేరే’ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నా రంగు వల్లే ఆ అవకాశం దక్కింది. కాబట్టి, అది నాకు సంతోషంగా, గర్వంగా అనిపించింది. ఆ తర్వాత నాకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ‘ఝాన్సీ కీ రాణి’ ఆడిషన్‌కి కాల్ వచ్చింది.
దక్షిణాది బాగుంటుంది
దక్షిణాది నుంచి అవకాశాలు వచ్చినప్పుడు, ‘ఎందుకు చేయకూడదు’ అనుకున్నా. 2015లో ‘ఆంధ్రాపోరి’లో ఆకాశ్ పూరితో కలిసి లీడ్ రోల్ చేశా. ఆ తర్వాత ‘రుద్రమదేవి’ సినిమా కోసం డైరెక్టర్ గుణశేఖర్ నుంచి ఆడిషన్ కాల్ వచ్చింది. అభినయానికి ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ పాత్ర కోసం ఆయన ఎంతోమందిని చూశారట. కానీ, ఎవ్వరూ నచ్చలేదట. నా నటన, హావభావాలు ఆయనకు నచ్చి, చిన్ననాటి ‘రుద్రదేవ’గా చేసే అవకాశం ఇచ్చారు. మగవారి కాస్ట్యూమ్స్‌తో చేసిన ఆ రోల్ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. సౌత్ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. చాలా ప్యాషన్‌తో పని చేస్తారు. యాక్టర్స్‌ని చాలా బాగా చూసుకుంటారు, గౌరవిస్తారు. నాకు సౌత్‌లో పెద్ద మూవీస్‌లో చేయాలని ఉంది. ‘రుద్రమదేవి’ తర్వాత 2016లో బాలీవుడ్లో ‘ట్రాఫిక్’ సినిమా చేశా. 2017లో ‘మిస్టర్ కబాడీ’, బెంగాలీ మూవీ ‘శ్రేష్ఠ బంగాళీ’లో నటించా. ఆ సంవత్సరమే మరాఠీ మూవీ ‘ఓద్: ది ఎట్రాక్షన్’ సినిమా చేశా. ఆ తర్వాత చేసిన హిందీ సినిమా ‘సింబా’లో నందినీ మోహిలే పాత్ర నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇలా నాలుగైదేండ్లలో ఐదారు భాషల్లో నటించా.
గుణ
