
న్యూఢిల్లీ: భారతీయ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మేనల్లుడు ప్రణవ్ అదానీకి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నోటీసు గత సంవత్సరమే జారీ అయింది. 2021లో సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు ఉన్న ఎస్బీ ఎనర్జీ హోల్డింగ్స్‌ను అదానీ గ్రీన్ ఎనర్జీ కొనుగోలు చేసేందుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ప్రణవ్ అదానీ తన బావమరిది కునాల్ షాకు వెల్లడించారని సెబీ ఆరోపించింది.
ఈ కేసులో కాల్ రికార్డ్‌లను, ట్రేడింగ్ ప్యాటర్న్స్‌ను సెబీ విశ్లేషించి నోటీసులు పంపించింది. కునాల్ షా, ఆయన సోదరుడు నృపాల్ షా తదనంతరం అదానీ గ్రీన్ షేర్లలో ట్రేడింగ్ చేసి రూ. 90 లక్షలకు పైగా లాభం పొందారని సెబీ ఆరోపిస్తోంది. షా సోదరులు తమ తరఫు న్యాయవాది ద్వారా ఈ ఆరోపణలను ఖండించారు. తాము రహస్య సమాచారం ఆధారంగా ట్రేడింగ్ చేయలేదని, ఆ సమాచారం అప్పటికే బహిరంగంగా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అయితే సెటిల్‌మెంట్ కోసం చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.