ప్రజావాణి ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకోవాలి : అడిషనల్ కలెక్టర్ సీతారామారావు

ప్రజావాణి  ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకోవాలి : అడిషనల్ కలెక్టర్ సీతారామారావు

సూర్యాపేట, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ కె. సీతారామారావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని,  వివిధ శాఖలలో చాలా కాలం పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలన్నారు.

  రాష్ట్ర స్థాయి ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం 78  దరఖాస్తులు వచ్చాయని భూసమస్యలకి సంబందించి 26 దరఖాస్తులు, జిల్లా పంచాయతీ అధికారి 8, డిడబ్ల్యుఓ 5, డిఆర్డిఏ 3 మిగిలిన 36 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించామని  అదనపు కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి - :  ఎస్పీ నరసింహ 

గ్రీవెన్స్ డే ద్వారా వచ్చిన ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఫోన్ ద్వారా పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. 

ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని పోలీస్ అధికారులకు సూచించామన్నారు.