కరెంట్ బిల్లులపై ‘ఏసీడీ’ పిడుగు!

కరెంట్ బిల్లులపై ‘ఏసీడీ’ పిడుగు!

హనుమకొండ, వెలుగు:  డిస్కంలు మరోసారి సాధారణ ప్రజలపై విరుచుకుపడ్డాయి. నిరుడు డెవలప్​మెంట్​ఛార్జీలంటూ వినియోగదారుల నడ్డివిరిచిన విద్యుత్ పంపిణీ సంస్థలు..ఇప్పుడు అడిషనల్​కన్సంప్షన్ ​డిపాజిట్ (ఏసీడీ) పేరిట భారం మోపుతున్నాయి. గతంలో ఇండస్ట్రీలు, కమర్షియల్​కనెక్షన్లకు మాత్రమే ఏసీడీ చార్జీలు వసూలు చేయగా, గతేడాది 300 యూనిట్లకుపైగా వినియోగించిన డొమెస్టిక్​ కనెక్షన్లపైనా ఈ భారం మోపారు. తాజాగా ఈ నెల నుంచి 300 యూనిట్ల లోపు కరెంట్​వాడిన వారికీ ఏసీడీ చార్జీలు వేస్తున్నారు. ఈ నెల వినియోగించిన విద్యుత్​కు రెండు రెట్ల దాకా వచ్చిన బిల్లులను చూసి పేద, మధ్య తరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. కాగా, ఏసీడీ కేవలం డిపాజిట్​మాత్రమేనని, ఒకవేళ వినియోగదారులు కనెక్షన్​క్యాన్సిల్ చేసుకుంటే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని కరెంట్ ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే వినియోగదారుడికి మరో ప్రత్యామ్నాయం ఉంటేనే కనెక్షన్​క్యాన్సిల్​చేసుకునే అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు డిపాజిట్​ ఎందుకు తీసుకుంటున్నారో అధికారులు సమాధానం చెప్పడం లేదు.  

గతంలో కేవలం ఇండస్ట్రీలకే..

సాధారణంగా కొత్త కనెక్షన్​తీసుకున్నప్పుడు లోడ్​వివరాలను బట్టి సర్వీస్​ కనెక్షన్, మీటర్ సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఛార్జీలు ఒక్కో కేటగిరీకి ఒక్కోరకంగా ఉంటుండగా.. విద్యుత్తు సంస్థలు ఇదివరకు కేటగిరీ-3 పరిధిలోకి వచ్చే ఇండస్ట్రీలకు ఏసీడీ పేరున ఛార్జీలు వసూలు చేసేవి. ఒకవేళ ఇండస్ట్రీలు బిల్లు కట్టలేకున్నా, ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టినా సంస్థకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ముందుగానే సగటు వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని అందుకు రెట్టింపు మొత్తాన్ని ఏసీడీ రూపంలో డిపాజిట్​ చేయించుకునేవి. ఆ తర్వాత కేటగిరీ-2 కిందికి వచ్చే కమర్షియల్​కనెక్షన్ల నుంచి కూడా ఏసీడీ వసూలు చేయడం ప్రారంభించారు. ఇదిలాఉండగా గతేడాది మే నెల నుంచి డొమెస్టిక్​ కనెక్షన్లకు కూడా ఏసీడీ విధించడం స్టార్ట్ చేశారు. నెలకు వినియోగించే సగటు యూనిట్లకు టారిఫ్ ఆర్డర్​ ప్రకారం ఛార్జెస్​, కస్టమర్​ఛార్జెస్, ఫిక్సుడ్​ ఛార్జెస్​, ఎలక్ట్రిసిటీ సుంకం అన్నీ కలపగా.. వచ్చే సరాసరి బిల్లును రెండింతలు చేసి ఏసీడీ పేరున డిపాజిట్​సొమ్ము వసూలు చేస్తున్నారు. ఈ మేరకు వినియోగదారుల నుంచి సగటున 2 నెలల బిల్లు డిపాజిట్​గా తీసుకుంటున్నారు.

300 యూనిట్లు లోపు వినియోగించినా వాతే..

ఇదివరకు డొమెస్టిక్​ కనెక్షన్లలో సగటున 500 యూనిట్లు దాటితేనే డిస్కమ్​లు ఏసీడీ వసూలు చేసేవి. గత సంవత్సరం నుంచి 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్​వినియోగించిన కనెక్షన్లపై ఏసీడీ భారం మోపాయి. చెప్పాపెట్టకుండా వినియోగదారులపై భారం వేయడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలాఉంటే ఈ నెల నుంచి 300 యూనిట్ల పరిధిని కుదించి..300  యూనిట్ల లోపు వాడుకున్నా ఏసీడీ ఛార్జీలు బాదుతున్నారు. దీంతో వినియోగదారులపై పెద్ద మొత్తంలో భారం పడుతోంది. ఉదాహరణకు హనుమకొండ జిల్లాలో కేటగిరీ వన్​కింద దాదాపు 3.34 లక్షల డొమెస్టిక్​ కనెక్షన్లుండగా..ఇందులో దాదాపు 30 శాతం మంది 300 యూనిట్లకుపైగా కరెంట్​వాడుతున్నారు. వీరందరికీ గతేడాదే ఏసీడీ ఛార్జీలు బాదేశారు. మిగతా 70 శాతం మంది వరకు నెలకు సగటున 300 యూనిట్లలోపే కరెంట్ వాడుతుండగా..ఇప్పుడు వారందరిపై భారం మోపుతున్నారు. ఒక్కో వినియోగదారుడిపై తక్కువలో తక్కువ రూ.300 నుంచి రూ.3 వేల వరకు ఏసీడీ డ్యూ పేరున ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన 300లోపు యూనిట్లు కాల్చే వినియోగదారులపై రూ.16 కోట్లకుపైగా భారం పడే అవకాశం ఉంది.

నష్టాలను తప్పించుకునేందుకే పేదలపై భారం

సాధారణంగా ఇంట్లో కనీస అవసరాలైన ఒకటి లేదా రెండు బల్బులు, ఫ్యాన్లు, టీవీ, ఫ్రిడ్జ్​ లాంటివి ఉపయోగించే మధ్య తరగతి, పేద కుటుంబాలే 300 యూనిట్ల లోపు కరెంట్​వాడుతుంటారు. కాగా, విద్యుత్​సంస్థలు నష్టాల నుంచి బయటపడేందుకు ఈ ఏసీడీ ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ఆ భారమంతా ఇప్పుడు మధ్య, పేద తరగతి కుటుంబాలపై పడుతోంది. ఈసారి ఏసీడీ డ్యూ చెల్లించిన తరువాత.. వచ్చే ఏడాది కరెంట్​వినియోగం ఏ కొంచెం ఎక్కువైనా మళ్లీ అదనపు బాదుడు తప్పదని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇదిలాఉంటే ఈ నెలను నోటిస్​ పీరియడ్​గా భావించి ఏసీడీ డ్యూ పేరున బిల్లులో మెన్షన్​ చేస్తున్నారు. ఒకవేళ ఈ నెలలో ఏసీడీ డ్యూ చెల్లించకపోతే ఫైన్​తో వచ్చే నెల బిల్లు వస్తుందని అధికారులు చెబుతున్నారు. నిరుడు ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని కేటగిరీల్లో కరెంట్​ఛార్జీలను పెంచగా.. సగటు వినియోగదారులపై ఆర్థిక భారం పెరిగింది. ఆ తర్వాత డెవలప్​మెంట్, అడిషనల్ ఛార్జీలని ఇష్టారీతిన బిల్లులు వసూలు చేయడంతో మరింత భారం పడినట్లయ్యింది. ఇప్పుడు డొమెస్టిక్​ కనెక్షన్లకూ ఏసీడీ విధిస్తుండటంతో  వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలపై భారం పెంచేలా విద్యుత్​సంస్థలు ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తున్నాయని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

కేవలం డిపాజిట్​ మాత్రమే

ఇదివరకు 300 యూనిట్లకుపైగా వాడితేనే ఏసీడీ డ్యూ వసూలు చేసేది. కానీ ఈ నెల నుంచి 300 యూనిట్లలోపు వారికి కూడా ఏసీడీ డ్యూ వసూలు చేస్తున్నం. ఇది కేవలం వినియోగదారుల డిపాజిట్​ మాత్రమే. ఒకవేళ వినియోగదారులు కనెక్షన్​ క్యాన్సిల్ చేసుకుంటే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది.
– కె.వెంకటరమణ, ఎస్​ఈ, హనుమకొండ

హనుమకొండ జిల్లా హసన్ పర్తికి చెందిన కె.రవి అనే వినియోగదారుడికి జనవరి నెలలో 32 రోజులకు గాను 90 యూనిట్లకు బిల్లు వేశారు. ఎనర్జీ ఛార్జెస్, కస్టమర్ ఛార్జెస్​, ఫిక్సుడ్​ఛార్జెస్​ ఇలా అన్నీ కలిపి రూ.325 వచ్చింది. సగటున నెలకు 87 యూనిట్లు వినియోగిస్తుండగా..ఏసీడీ డ్యూ​ పేరున రూ.622 అదనంగా వేశారు. దీంతో హమాలీ పని చేసుకునే రవి ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్నాడు. 

హనుమకొండ బాలసముద్రం ఏరియాకు చెందిన కుందూరు వీణకుమారికి జనవరి 4న కరెంట్​బిల్లు వచ్చింది. 30 రోజుల్లో 244 యూనిట్లు వినియోగించగా అన్ని ఛార్జీలు కలిపి రూ.1,514 బిల్లు వేశారు. నెలకు సగటున రూ252.13 యూనిట్లు వినియోగిస్తున్నారని ఏసీడీ డ్యూ ఏకంగా రూ.2,990 వేశారు. గతంలో 300 యూనిట్లకుపైగా వాడిన వారికి మాత్రమే వసూలు చేసిన ఛార్జీలు ఇప్పుడు ఆ లోపు కరెంట్​వినియోగించిన వారికీ వేస్తుండడంతో వినియోగదారులు కలవరపడుతున్నారు.