పాశమైలారం ఘటన: 42కి చేరిన మృతులు

పాశమైలారం ఘటన: 42కి చేరిన మృతులు

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్యగంటగంటకు పెరుగుతోంది. మృతుల సంఖ్య  42 కి చేరింది. శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. హైడ్రా,ఎన్డీఆర్ఎఫ్,ఎస్ డీఆర్ఎఫ్ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.  మరో రెండు గంటల పాటు శిధిలాల తొలగించే ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది.  అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ తోపాటు ప్రొడక్షన్ బిల్డింగ్  కుప్పకూలడంతో ప్రమాద తీవ్రత పెరుగుతోంది.   చనిపోయిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు బీహార్ జార్ఖండ్ కు చెందిన వారే ఉన్నారు. 

 ప్రమాదంలో ఇప్పటి వరకు 42 మంది మృతిచెందారు. 33 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని. 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని చెప్పారు. తొమ్మిది మంది కార్మికులు ధృవ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో  ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. 

 
పాశమైలారం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో  ఘటనా స్థలాన్ని పరిశీలించి ధృవ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు సీఎం రేవంత్. సహాయ చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్​ రామకృష్ణారావు ఆధ్వర్యంలో డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ స్పెషల్​ సీఎస్​, లేబర్​ డిపార్ట్​మెంట్ పీఎస్​, హెల్త్ సెక్రటరీ, ఫైర్​సర్వీసెస్​ అడిషనల్​ డీజీని ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతలను ఈ కమిటీకి అప్పగించారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మి కుల కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

 మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల ఎక్స్ గ్రేషియా

పాశమైలారం ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలుగు, ఇంగ్లిష్ లో ఆయన స్పందించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలోని ఒక ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’  అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్‌‌ఆర్‌‌ఎఫ్‌‌) నుంచి తక్షణ సాయంగా రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌‌గ్రేషియా అందిస్తామని ఆయన ప్రకటించారు.