అమెరికా చట్టసభలో..హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ రద్దుకు బిల్లు

అమెరికా చట్టసభలో..హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ రద్దుకు బిల్లు
  • అమెరికా చట్టసభలో ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సభ్యుడు గ్రెగ్​స్ట్యూబ్​
  •  విదేశీ ఉద్యోగులు, కార్మికులతో స్థానికులు నష్టపోతున్నారని వెల్లడి
  • బిల్లు ఆమోదం పొందితే  ఈ వీసాలు ఉండవంటున్న నిపుణులు

 హెచ్1బీ వీసా ప్రోగ్రామ్​ను పూర్తిగా ముగించే బిల్లును అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌‌లో ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్ట్యూబ్ ప్రవేశపెట్టారు. ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టాన్ని సవరించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.

న్యూయార్క్/వాషింగ్టన్: హెచ్1బీ వీసా ప్రోగ్రామ్​ను పూర్తిగా ముగించే బిల్లును అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌‌లో ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్ట్యూబ్ ప్రవేశపెట్టారు. ‘ఎండింగ్ ఎక్స్‌‌ప్లోయేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎక్సెప్షన్స్ యాక్ట్’ లేదా ఎక్సైల్ చట్టంగా పేర్కొంటూ సోమవారం దీనిని ప్రవేశపెట్టారు. 

ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టాన్ని సవరించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అమెరికా కార్మికుల ఉద్యోగాలను కాపాడాలని, కంపెనీలు తక్కువ వేతనాలకు విదేశీ కార్మికులను తీసుకురావడం ఆపాలని గ్రెగ్​స్ట్యూబ్​ఈ ప్రతిపాదన తెచ్చారు. ఇది ఆమోదం పొందితే ఇమిగ్రేషన్  చట్టంలో మార్పులు చేసి, 2027 ఆర్థిక సంవత్సరం నుంచి హెచ్​1బీ వీసాల జారీని పూర్తిగా ఆపివేస్తుంది. భవిష్యత్తులో హెచ్1బీ వీసాలు అనేవి ఇవ్వబోరు.

స్థానికుల అవకాశా​లు పోతున్నాయి: గ్రెగ్

గ్రెగ్ స్ట్యూబ్ ఈ బిల్లుపై మాట్లాడుతూ.. “విదేశీ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వడం అమెరికా పౌరుల శ్రేయస్సును, సంపదను దెబ్బతీస్తున్నది. ఇది మన విలువలకు, జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకం” అని అన్నారు. ఈ వీసా వ్యవస్థ వల్ల అమెరికా యువత, కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారని, వారి భవిష్యత్తు అవకాశాలు తగ్గుతున్నాయని తెలిపారు. “అమెరికా కలను మన పిల్లల కోసం కాపాడాలి, విదేశీయులకు ఇచ్చి వదులుకోకూడదు” అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా పౌరుల ఉద్యోగాలు, వేతనాలు, అవకాశాలను రక్షించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం అన్నారు.

హెచ్​1బీపై ప్రచారాలు, ప్రభావం 

ఈ వీసా కార్యక్రమం ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న విదేశీయులకు అమెరికాలో పనిచేసే అవకాశం ఇస్తుంది. దీనిలో 80% మంది భారతీయులు, చైనా పౌరులే ఉంటారు. ఇది అమెరికన్ల ఉద్యోగాలను తీసేస్తోందని, వేతనాలను తగ్గిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

కొన్ని ముఖ్య ఉదాహరణలు:

  • 2015లో డిస్నీ కంపెనీ 250 మంది అమెరికా ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో హెచ్​1బీ వీసాతో వచ్చిన విదేశీయులను నియమించింది.
  • 2014లో సదరన్ కాలిఫోర్నియా ఎడిసన్ కంపెనీ 540 మందిని తొలగించి, ఔట్‌‌సోర్సింగ్ కంపెనీల నుంచి విదేశీ కార్మికులను తీసుకుంది.
  • 2025లో మైక్రోసాఫ్ట్​లో 16 వేల మంది అమెరికా ఉద్యోగులు తొలగించారు,  9 వేల హెచ్​1బీ వీసాల ఆమోదం తర్వాత ఈ పరిణామం జరిగింది.
  • ఈ వ్యవస్థ వల్ల 10 వేల కంటే ఎక్కువ అమెరికా వైద్యులు రెసిడెన్సీ కార్యక్రమాలకు దూరమవుతున్నారు. అదే సమయంలో 5 వేల కంటే ఎక్కువ విదేశీ డాక్టర్లు అమెరికాకు వస్తున్నారు.