ఉట్నూర్, వెలుగు: మతి స్థిమితం లేని తమ్ముడు బావిలో దూకుతానని, ఆత్మహత్య చేసుకుంటానని సోదరుడికి చెబుతూ రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో దూకాడు. అతడిని కాపాడబోయిన అన్న కూడా తమ్ముడితో పాటు చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం ఉమ్రి కోలాంగూడకు చెందిన ఆత్రం సోనేరావుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
మండలంలోని శ్యాంపూర్ బుడుందేవ్ జాతరకు వచ్చి మంగళవారం రాత్రి ఇంటికి నడిచి వెళ్తుండగా, మతి స్థిమితం లేని ఆత్రం లేతు(27) ఆత్మహత్య చేసుకుంటానని కేకలు వేసుకుంటూ రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో దూకాడు.
తమ్ముడిని కాపాడాలన్న ఉద్దేశంతో వెంటనే బావిలో దూకిన అన్న ఆత్రం జంగు(29) బావిలో మునిగిపోయాడు. జంగుకు వివాహం కాగా గతంలోనే భార్య చనిపోయింది. లేతుకు భార్య మోతుబాయి, ఒక పాప ఉంది. ఘటనా స్థలాన్ని ఉట్నూర్ ఎస్సై విజయ్ గుంపుల పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చేపలు పట్టడానికి వెళ్లి బాలుడు..
మహబూబ్ నగర్ రూరల్: అన్నదమ్ములతో కలిసి చేపలు పట్టడానికి వెళ్లి చెరువులో మునిగి ఓ బాలుడు చనిపోయాడు. ఏఎస్సై కృష్ణ దాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ మండలం రామచంద్రాపురం గ్రామంలోని వెంకటేశ్వర రైస్ మిల్లులో బిహార్ కు చెందిన అజయ్ గిరి, జ్యోతిగిరి దంపతులు లేబర్ పని చేస్తున్నారు. వారికి ఆకాశ్, వికాస్, ఓం ప్రకాశ్(7) పిల్లలు ఉన్నారు.
సోమవారం మధ్యాహ్నం రైస్ మిల్లు సమీపంలోని నందప్పకుంట చెరువు దగ్గర ఆడుకుంటూ చేపలు పట్టడానికి నీటిలోకి దిగారు. ముగ్గురు నీళ్లలో మునిగిపోగా, సమీపంలో ఉన్న పశువుల కాపరులు ఇద్దరిని కాపాడగా, ఓం ప్రకాశ్ చనిపోయాడు. మంగళవారం ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది డెడ్ బాడీని బయటకు తీశారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
