న్యూఢిల్లీ: అమెరికా, బంగ్లాదేశ్ రెసిప్రోకల్ ట్రేడ్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకున్నాయి. దీని ద్వారా డెయిరీ, బీఫ్, పౌల్ట్రీ వంటి సున్నిత రంగాల్లో కూడా అమెరికా తన ప్రొడక్ట్‌లను అమ్ముకోవడానికి వీలుంటుంది. బంగ్లాదేశ్ గార్మెంట్ ఎగుమతులకు జీరో టారిఫ్ లభించింది. కానీ, అమెరికాకు చెందిన కాటన్, సింథటిక్ వంటి మెటీరియల్స్ వాడితేనే ఈ రాయితీ లభిస్తుంది. తాజా డీల్‌తో బంగ్లాదేశ్‌పై అమెరికా వేస్తున్న టారిఫ్ రేటు 20 శాతం నుంచి 19 శాతానికి తగ్గింది.
అమెరికాకు లభించే ప్రయోజనాలు..
అమెరికా కార్లు, మోటార్‌సైకిళ్లు, మెడికల్ డివైసులు, ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ , టెక్నాలజీ పరికరాలు, ఎనర్జీ ఉత్పత్తులు, సోయ్ ఆధారిత వస్తువులకు బంగ్లాదేశ్‌లో ప్రయారిటీ ఉంటుంది. యూఎస్ గోధుమ, సోయాబీన్, ఎల్‌ఎన్‌జీ అమ్మకాలు పెరుగుతాయి. అలానే అమెరికా కంపెనీల ఈ–-కామర్స్ లావాదేవీలపై టారిఫ్‌లు విధించకూడదని ఒప్పందంలో ఉంది.
బంగ్లాదేశ్ 3.5 బిలియన్ డాలర్ల విలువైన యూఎస్ గోధుమలు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తులను, 15 బిలియన్ డాలర్ల విలువైన ఎనర్జీ ఉత్పత్తులను రానున్న 15 ఏళ్లలో దిగుమతి చేసుకోవాలి. బోయింగ్ నుంచి 25 విమానాలు కొనుగోలు చేయాలి.
