
హైదరాబాద్, వెలుగు: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) గడువు సోమవారంతో ముగిసింది. మంగళవారం నుంచి 25 శాతం రాయితీ లేకుండా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కలిపి మొత్తం 25 లక్షల మంది దరఖాస్తుదారులు ఉండగా ఇందులో 6 లక్షల మంది ఫీజులు చెల్లించగా మొత్తం రూ.2043.11 కోట్లు వసూలు అయినట్లు డీటీసీపీ (డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్) అధికారులు చెబుతున్నారు.
అత్యధికంగా మున్సిపాలిటీల్లో రూ.885.97 కోట్లు, కార్పొరేషన్లలో రూ.451.66 కోట్లు, హెచ్ఎండీఏలో రూ.228.84 కోట్లు, జీహెచ్ఎంసీలో రూ.196.04 కోట్లు వసూలైంది. ఇప్పటికి పలు సార్లు గడువు పొడిగించినా చాలా మంది ఫీజు చెల్లించటం లేదు. కాగా ఎల్ఆర్ఎస్ ద్వారా మొత్తం రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని సర్కారు అంచనా వేసినప్పటికి ఇందులో 20 శాతం మాత్రమే వసూలైంది.