ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కోసం క్యూ!

ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కోసం క్యూ!

 కాగజ్ నగర్, వెలుగు : వానలు పడుతుండడంతో వ్యవసాయ పనులు ముమ్మరకావడంతో రైతులు యూరియా కోసం తండ్లాట పడుతున్నారు. బహిరంగ మార్కెట్ లో ఎక్కువ ధర ఉండడంతో సహకార సంఘాల వద్ద యూరియా కొనేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. సోమవారం ఆసిఫాబాద్ ​జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో యూరియా అమ్ముతుండగా రైతులు వందలాదిగా వెళ్లి పాస్ బుక్, ఆధార్ కార్డులతో క్యూ లో నిలబడ్డారు. అయితే సర్వర్ స్లో గా ఉండడం, బయోమెట్రిక్ మెషీన్ సతాయించడంతో ఒక్కో రైతు బస్తాలు నమోదు చేసేందుకు సుమారు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పట్టింది.

అయినా కొందరు రైతులకు యూరియా దొరకలేదు. రైతులు వానలో తడుస్తూ క్యూ లైన్ లో నిల్చుని ఇబ్బంది పడుతుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. యూరియా ఇండెంట్ పెట్టినా సరిగా సప్లై కావడం లేదని, సోమవారం మూడు లారీల యూరియా పంపిణీ చేశామని మండల వ్యవసాయాధికారి గిరీషన్ తెలిపారు.