
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 36 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. అందులో ఇద్దరిని మంత్రులను కూడా చేశారు. ఆ 36 మందిలో ఎవరూ కూడా పదవికి రాజీనామా చేయలేదు. స్పీకర్ అనర్హత వేటు వేయలేదు. కేసీఆర్‌ను సూటిగా అడుగుతున్నా.. ఆనాడు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను ఎందుకు రాజీనామా చేయించలేదు. మీరు చేస్తే సంసారం.. మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారమా..? అని ప్రశ్నించారు కడియం శ్రీహరి.
శుక్రవారం (సెప్టెంబర్ 19) స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నుంచే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. 15 ఏళ్లుగా వెనుకబడిన స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వమని అడిగితే ప్రజలు నన్ను నమ్మి గెలిపించారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గానికి ఇవ్వని నిధులు స్టేషన్ ఘనపూర్‌కు కేటాయించారని.. ఏడాదిన్నరలో రూ.1027 కోట్లు ఇచ్చారని తెలిపారు. తనపై కొంతమంది చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారని.. నిజజీవితంలో సభ్యత, సంస్కారం లేని నాయకులే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు మాటలు, విమర్శలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు పనికిరావని చురకలంటించారు.
కాంగ్రెస్ పార్టీలోకి రాజయ్యను చేర్చుకోవద్దని నియోజకవర్గ మహిళలు మేడారం వెళ్ళి అమ్మవారిని మొక్కుకున్నారని.. అలాంటి నీచమైన వ్యక్తిత్వం ఆయనదని విమర్శించారు. వ్యక్తిగతంగా తాను ఫిరాయింపులను సమర్ధించనని.. కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సొంత అభిప్రాయాలు పక్కనపెట్టాల్సి వస్తుందని తెలిపారు. పార్టీ ఫిరాయింపుపై వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ ఇచ్చిన నోటీస్ ఇచ్చారని.. రిప్లై ఇవ్వడానికి ఈ నెల చివరి వరకు గడువు ఉందన్నారు. అప్పటిలోగా స్పీకర్‌కు సమాధానం ఇస్తానని తెలిపారు. నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ తెలుస్తారని అన్నారు.