
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారావేత్త రాజ్ కుంద్రాకు సంబంధించిన రూ. 60 కోట్ల మోసం కేసులో కీలక మలుపు తిరుగుతోంది. ముంబై పోలీసులు ఆర్థిక నేరాల విభాగం ( EOW ) ఈ కేసులో మరింత దూకుడు పెంచింది. ఆర్థికలావాదేవిలకు సంబంధించిన ఈ కేసులో మరింత సమాచారం సేకరించడానికి రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా బాలీవుడ్ ప్రముఖులైన నేహా ధూపియా, బిపాషా బసు,నిర్మాత ఏక్తా కపూర్లను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిలిచిపోయిన 'బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థ నుండి వీరు అందుకున్న చెల్లింపుల వివరాలను EOW సేకరించనుంది.
బాలీవుడ్ సెలబ్రీలకూ నోటీసులు.. ?
బెస్ట్ డీల్ టీవీ సంస్థ భారతదేశంలోనే మొట్టమొదటి సెలబ్రిటీల ఆధారిత టెలిషాపింగ్ ఛానెల్‌గా ప్రచారం పొందింది. దీనిని శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, నటుడు అక్షయ్ కుమార్ కలిసి ప్రారంభించారు. అయితే ఈ సంస్థ లావాదేవీలలో ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో EOW రంగంలోకి దిగింది. - ఏక్తా కపూర్, నేహా ధూపియా, బిపాషా బసు - సంస్థకు బ్రాండింగ్ , ప్రచార కార్యక్రమాలు చేసినందుకు ఎంత మొత్తం అందుకున్నారు, ఆ డబ్బు ఎలా చెల్లించబడింది అనే వివరాలను EOW సేకరించనుంది.
EOW విచారణ బృందం ఈ సంస్థ యొక్క నిధులను దుర్వినియోగం చేశారని అనుమానిస్తోంది. కంపెనీ నిధులను అక్రమంగా వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి, అందుకే ప్రతి లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం అధికారులు చెబుతున్నారు. బెస్ట్ డీల్ టీవీ సంస్థ అనేక మంది సెలబ్రిటీలకు ప్రచారం కోసం పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పుడు ఈ సెలబ్రిటీలను విచారణకు పిలచే అవకాశం ఉంది.
కేసు వివరాలు.
లోటస్ క్యాపిటల్ ఫైనాన్స్ సర్వీసెస్ అనే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ డైరెక్టర్ అయిన దీపక్ కోఠారి (60) ఈ కేసును నమోదు చేశారు. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, మరికొంత మంది తమను 'బెస్ట్ డీల్ టీవీ'లో పెట్టుబడి, రుణ ఒప్పందం పేరుతో రూ. 60.4 కోట్లు మోసం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే EOW దర్యాప్తు వేగవంతం చేసింది.
ఈ కేసు తీవ్రత దృష్ట్యాలో పెట్టుకుని గతంలోనే శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేయబడ్డాయి. గత వారం, ఈ కేసులో సుమారు ఐదు గంటల పాటు విచారణను ఎదుర్కొన్న రాజ్ కుంద్రా తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిజం త్వరలోనే బయటకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలోనూ పలు కేసుల్లో ఇరుక్కున్న రాజ్ కుంద్రా ఈసారి మాత్రం ఈ కేసులో చాలా సీరియస్ గా ఉన్నారని, నిందితులపై తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో మరింత మంది ప్రముఖులను కూడా విచారించే అవకాశాలు లేకపోలేదని EOW వర్గాలు తెలిపాయి.