
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త వేరే మహిళతో ఉండటం చూసి తట్టుకోలేక.. మనస్థాపంతో ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. శుక్రవారం (సెప్టెంబర్ 19) ఉదయం హైదరాబాద్ సరూర్ నగర్ చెరువులో నుంచి మహిళ మృత దేహం లభ్యం కావడంతో సంచలనంగా మారింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పొల్లా సాయి కుమార్, భవానీ (28) భార్యాభర్తలు. పదేండ్లుగా చంపాపేట డీ-మార్ట్ వెనుక ఉన్న దుర్గాభవాని నగర్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ దంపతులు తరచుగా గొడవ పడుతున్నారు. ఐదు రోజులుగా సాయి కుమార్ మరొక మహిళతో ఉంటుండడం తో భవాని తీవ్ర మనస్థాపానికి గురైంది.
దీంతో కల్లు తాగుతూ అతడితో గొడవకు దిగింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన భవానీ.. గురువారం (సెప్టెంబర్ 18) సాయంత్రం సరూర్ నగర్ చెరువు దగ్గరకు కాలినడకన వెళ్లి, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
రెండు రోజుల క్రితం సాయికుమార్ తన భార్యపై ఫిర్యాదు చేయడానికి సైదాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన భార్య గొడవ పడుతుందని ఫిర్యాదు చేయడంతో.. ఇద్దరికీ స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు పోలీసులు.
చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న భవానీ మృతదేహం కోసం పోలీసులు, హైడ్రా బృందం, అగ్నిమాపక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు మృత దేహం లభ్యమైంది. మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు.