స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి రాజ్యాంగం పూర్తి హక్కులు ఇచ్చింది. కానీ ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నా ఈసీ పట్టించుకోవడం లేదు. అసలు ఎక్కడా డబ్బు పంపిణీ జరగనట్లే నటిస్తున్నారు. గత 9 రోజులుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వేల కోట్లు ఖర్చు పెట్టారు.
అంతకు ముందు పంచాయతీ ఎన్నికల్లో రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారని వార్తలు వచ్చాయి. బిహార్‌లో ఓ ఎంపీ రూ. కోటికి మించి ఖర్చుపెట్టరు. కానీ ఇక్కడ ఒక కార్పొరేటర్కూడా అంతకు మించి ఖర్చు చేస్తున్నారు. డబ్బులు, కానుకలు పంచుతున్నట్లు మీడియాలో ఫొటోలు, వీడియోలు వస్తున్నా సదరు అభ్యర్థుల మీద అధికారులు కేసులు పెట్టడం లేదు. ఎన్నికలంటే నేతలకు పెట్టుబడిగా మారింది. ఓట్లను కొని, గెలిచాక అంతకు ఎన్నో రెట్లు రాబట్టుకోవాలని భావిస్తున్నారు. ఇది జనానికి అర్థం కావడం లేదు.
ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు. దీంతో ఇదో ట్రెండలా మారింది. ఓటర్లకు డబ్బులు పంచేవారు పట్టుబడితే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలి. డబ్బులు అడిగి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపాలి. అప్పుడే మార్పు సాధ్యమవుతుంది.
- పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్-
