పద్మారావునగర్, వెలుగు : తండ్రి ఆస్తిని రాయించుకున్న ఇద్దరు కూతుళ్లు.. ఆయన బాగోగులు పట్టించుకోకుండా బయటకు గెంటేశారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆ తండ్రి కూతుళ్ల ఇంటి ఎదుట ధర్నాకు దిగాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని మారేడుపల్లి లక్ష్మీనగర్ బస్తీలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మహంకాళి రాజలింగం అనే వ్యక్తి మిథాని సంస్థలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు కొడుకులు లేకపోవడంతో మారేడుపల్లిలో ఉన్న 130 గజాల స్థలాన్ని తన ఇద్దరు కుమార్తెలు భాగ్యలక్ష్మి, ఝాన్సీకి రాసిచ్చాడు. ఆస్తిని తీసుకున్న కూతుళ్లు తర్వాత తండ్రి బాగోగులు పట్టించుకోవడం మానేశారు. దీంతో కూతుళ్లు తనకు తిండి పెట్టడం లేదని, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రాజలింగం బుధవారం కుమార్తెల ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగాడు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులు, ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు. రాజలింగం పరిస్థితిని గమనించిన బస్తీవాసులు అన్నం పెట్టి ఆదుకుంటున్నారు.
