శభాష్ లింగంపల్లి.. చిన్నారి చికిత్సకు రూ.లక్ష సాయం అందించిన గ్రామస్తులు

శభాష్ లింగంపల్లి..  చిన్నారి చికిత్సకు రూ.లక్ష సాయం అందించిన గ్రామస్తులు

లింగంపేట,వెలుగు: ఊపిరితిత్తుల్లో హోల్​బ్లాక్ అయి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ​చిన్నారి వైద్యఖర్చుల కోసం లింగంపల్లి గ్రామస్తులు రూ. లక్ష సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన  బందెల శేఖర్ కుమార్తె రుచిత (20 నెలలు) అనారోగ్యానికి  గురికాగా మంగళవారం కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి  తరలించారు. పాపను  పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో హోల్​ బ్లాక్​ అయిందని, వెంటనే ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.3లక్షలు ఖర్చవుతాయని  చెప్పారు.

దీంతో అయోమయానికి గురైన తండ్రి శేఖర్ పాప వైద్యఖర్చుల విషయాన్ని గ్రామ సర్పంచ్ గొల్ల ప్రత్యూష సాయిరాంకు ఫోన్​లో విన్నవించారు.  స్పందించిన  సర్పంచ్​ గ్రామస్తులతో  చర్చించి రూ.లక్ష వరకు చందాలు చేసి చిన్నారి తల్లికి అందజేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంతో చుట్టుపక్కల గ్రామస్తులు శభాష్​ లింగంపల్లి అంటూ అభినందనలు తెలుపుతున్నారు. నగదు అందించిన వారిలో ఉపసర్పంచ్​సంతోష్​, బానుచందర్​గౌడ్​,లక్ష్మణ్, లింగు ఆనంద్, నవీన్, అనిల్ తదితరులు ఉన్నారు.