మోదీ పాలనలో దేశ వ్యవస్థలన్నీ నాశనం : మల్లురవి 

మోదీ పాలనలో దేశ వ్యవస్థలన్నీ నాశనం : మల్లురవి 
  • తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లురవి 

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి అన్నారు. ప్రధానంగా రైతు సమస్యలను కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచం దేశాల్లో ఆర్థిక, టెక్నికల్ యుద్ధాలు పెరుగుతున్నాయని తెలిపారు.

అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని, అదే విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పారని పేర్కొన్నారు. కానీ, వాస్తవాలు దేశ ప్రజలకు తెలియకుండా దాచేందుకు యత్నిస్తున్న బీజేపీ లోక్ సభ ప్రతిపక్షానేత గొంతు నొక్కుతున్నదని ఫైర్ అయ్యారు. ట్రంప్ కు మోదీ సరెండర్ అయ్యారని విమర్శించారు.

దీని ఫలితంగా దేశంలోని అన్ని రంగాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానాలో ఇటీవల కుల వివక్షతో తెలుగు ఐపీఎస్ అధికారి మృతి చెందారని, దానికి కారణాలు ఇప్పటికీ తెలియలేదని వెల్లడించారు. దేశంలో పరిస్థితులు ఇలాగే ఉంటే అంతర్గతంగా కుల, మత యుద్ధాలు జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.